కరోనా నేర్పిన గుణపాఠాలు

‘క‌ష్ట‌మోచ్చినా, నష్టమొచ్చిన, క‌న్నీరొచ్చినా చివరకు కరోనా మహామ్మారి రుద్రతాండవం చేసిన తొడంటూ ఉండేదెప్పుడూ స్నేహం ఒక్క‌టే` అని ఓ సినీ గేయ ర‌చ‌యిత చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం నిజ‌మ‌నిస్తోన్నాయి. క‌రోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ కుటుంబాలు బంధానుబంధాల క‌ల‌బోత‌కి, స్నేహానికి, ప్రేమ ఆప్యాయతలకు సాక్షి భూతంగా నిలిచింది. సాధార‌ణంగా లాక్‌డౌన్‌ మెజారిటీ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 24/7 ఇంట్లోని నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ప‌రిమిత‌మైన దుస్థితి నెలకొంది. సహాయ సహకారాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటంతో కొత్త మిత్రులు, బంధాలు ఏర్పడుతున్నాయి.

 

ముఖ్యంగా బహుళ అంతస్థుల్లో నివసిస్తున్న వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘గత 11 రోజులుగా అత్యవసర రంగాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. దీంతో పొరుగింటి వారి సాయంతో నెట్టుకొస్తున్నాం. కరోనా పుణ్యమా అని సామాజిక బంధాలు బలపడుతున్నాయి’’ అని సాగ‌ర్ అనే ఢిల్లీలో నివసించే ఓ ప్ర‌యివేటు ఉద్యోగి వాట్సాప్‌లో స్టాట‌స్ పెట్టుకొని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఇక హైద‌రాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉండే ర‌మేష్ బొడ్డుప‌ల్లి తన ఎదురింటిలో ఉండే వృద్ధదంపతుల కష్టాన్ని చూసి తల్లడిల్లిపోయారు. వాళ్ళ క‌ష్టం చూసి చ‌లించి, ఏదైనా సహాయం కావాలంటే తనకు ఫోన్‌ చేయాలని చెప్పాడు. మందు గోలీలు, ఇతర నిత్యావసర వస్తువులను రెండు మూడు రోజులకోమారు తెచ్చి వారి ఇంటి ముందున్న సంచిలో వేస్తున్నాడు. వారు నగదును ఆన్‌లైన్‌ ద్వారా పంపుతున్నారు. ఆఫీసు ప‌ని చేసిన రోజుల్లో త‌మతో క‌నీసం మాట్లాడ‌ని వ్య‌క్తి నేరుగా త‌మ‌కి సాయం గొప్ప‌గా ఉంద‌ని ఆ వృద్ధులు వ్యాఖ్యానించిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో పెట్టుకుంటున్నాడు. ఇదే తీరులో ఖైరతాబాద్‌లో నివసించే ఐదుగురు అన్నదమ్ముల కుటుంబాల్లో సఖ్యత వచ్చింది. ఎడమొహంగా ఉండే వారంతా బయటకి వెళ్లకుండా ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ఇక ప్రగతి నగర్‌లో ఐదేళ్లుగా ఒకే అపార్టుమెంట్‌లో నివసిస్తున్నా ఎడమొహం పెడమొహంగా తిరిగే సురేష్ , మ‌ద‌ర్ కొత్త‌ స్నేహం కార‌ణంగా క‌లిశారు. లాక్‌డౌన్‌ వేళ మ‌ద‌ర్‌ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఖాళీకావడంతో నేనున్నానంటూ సురేష్ సహాయం చేశారు. అంతే వారి మధ్య మునుపటి దూరం తగ్గిపోయింది. లాక్‌డౌన్ వ‌ల్ల కొంత ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ, ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆనంద‌క‌ర ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ అభినాష్‌రెడ్డి వారం రోజులుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అమెరికాలో ఓ ఆసుపత్రి వైద్యుల సలహాలను ఆన్‌లైన్‌లో విని ఇక్కడి నుంచి టైప్‌ చేసి అక్కడి రోగులకు అందించడం ఆయన విధుల్లో ఒక భాగం. రెండు రోజుల క్రితం ఆయన ల్యాప్‌ట్యాప్‌ చెడిపోయింది. ఒక్కసారిగా పని ఆగిపోవడంతో తన కింది అంతస్థులో ఉండే ఓ యువకుడు తన ల్యాపీని అందించి ఈ సమయంలో ఆదుకున్నారు. వారు ఇద్ద‌రు క‌లిసే ఒకే బంగ్లాలో సుమారు మూడు సంవ‌త్స‌రాలుగా ఉంటున్నా పెద్ద‌గా మాట్లాడుకోని వాతావ‌ర‌ణం ఉండేది. కానీ, క‌రోనా లాక్‌డౌన్ వారి మ‌ధ్య మాట‌లే కాదు, స‌రికొత్త స్నేహాన్ని చిగురింప చేసింది.

కరోనా సాధించిన విజయాలు:

1. చుక్క‌, ముక్క లేనిదే బ‌త‌క‌ని జ‌నం ఉన్నా… సంపూర్ణ మద్య నిషేధం అమలు నడుస్తోంది. అది కూడా ఏ గల్లికో రాష్ట్రానికో పరిమితం కాదు మన భారత దేశం అంతటా. మహాత్మా గాంధీజీ బతికి ఉంటే ఎంతో సంతోషించే వాళ్లు.

2. ఆది అంతం లేని దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోవడం. ఏడుపులు, పెడబొబ్బలు, కుటుంభ కలహాలు, క్రైమ్ ప్రోత్సాహంగా సాగే సాగదితలు లేకుండా హాయిగా ఉంది.

3. మెట్రో న‌గ‌రాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు ఐదు గంటలు రోడ్లపై ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి నుంచి బయట పడటం. ట్రాఫిక్ లేని నగరాలు, కూడళ్ళు ద‌ర్శ‌న‌మివ్వ‌డం. ఖాళీ రోడ్లతో ప్రశాంత వాతావరణం.

4. కాలుష్య రహిత పట్టణాలు. శబ్ద,వాయు కాలుష్యం లేకుండా పోయింది. హాయుగా ప్రాణ వాయువు ఆక్సిజన్ గుండెల నిండా పీలుస్తున్నాము.

5. మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడం. డబ్బులు నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువులు ఆర్థిక భారం లేకుండా అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం.

6. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడం. బయట అడ్డమైన దరిద్రాలు తినకపోవడం. జంక్ ఫుడ్ వ్యవస్థలకు గుడ్ బై చెప్పేసేయడం జరిగింది.

7. వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం. బండిలో పెట్రోల్ తగలేసి ఊరు, వాడ త్రిపాద నక్షత్రాల లాగా తిరక్కపోవడం. బలాదూరులు తిరగడం కట్.

8.సాధ్యమైనంతవరకు మాంసం మానేసి శాఖాహారము తినడం. భారతీయ సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని పాటించడం జరుగుతోంది.

9. ఆయయోగ్యమే మహా భాగ్యం. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు అని కోరుకోవడం.

10. ఐక్యమత్యమే మహాబలం. డబ్బు ఎంత ఉన్నా, అవసరమైనప్పుడు మన పని మనమే చేసుకోవాలని పని మనిషి లేకపోయినా ఇంటి పనులు కలసి మెలసి అంతా ఐక్యంగా చేసుకోవడం.

11. అన్నింటికీ అంతకు మించి గందరగోళం, హడావుడి, ఆయాసం, ఆతృత, తొందరపాటు, మానసిక ఒత్తిళ్లు అన్నింటికీ శుభం పలికి అత్యంత ప్ర‌శాంతంగా బ‌తుకుతున్న మాన‌వ జీవితం నభూతో నభవిష్యత్..

12. పెళ్ళాం పిల్లలు, తల్లిదండ్రులు అందరితో కలసిమెలసి హాయిగా ఆహార్నిశలు శ్రమించే ఇంటి యజమాని పిల్లల చదువు సంధ్యలు గమనించడం, వాళ్లతో ఆటపాటలతో ఆనందంగా గడపటం మరుపురాని చెరిగిపోని మదురానుభూతులు.

13. క్రైమ్ అనే మాట వినబడటం లేదు. ఉదయాన్నే పేపర్, టీవీలు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా క్రైమ్ క్రైమ్ గోల ఉండేది ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది.

14. ఆర్థికంగా కంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలని మంచి గుణపాఠాలు నేర్చుకున్నాము.

15. ఎప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగులను హేళన చేసే విధంగా వ్యవహరిస్తే ఇప్పుడు అత్యవసర సేవలు వహిస్తోన్న6వాళ్లందరికీ దాసోహం, దండాలు చేస్తున్నాము.