స్మార్ట్ సిటీలు- ONLINE- టెలి మెడిసిన్.

దేశంలో అనుమానిత కోవిడ్-19 కేసుల పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు మరియు నగర పరిపాలకులు సమన్వయంతో పనిచేసేలా స్మార్ట్ సిటీలు ఏర్పాట్లు చేకూరుస్తున్నాయి. అనుమానిత కేసుల్లో క్రమం తప్పకుండా వారి ఆరోగ్య పరిస్థితిని గమనించడమే కాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నక్షాలను ఉపయోగించి వారి గమనాన్ని పర్యవేక్షించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

కోవిడ్-19 విశ్వ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం కీలకమైనది. సమర్ధవంతమైన సమాచార సందేశాల ద్వారా పౌరులకు భద్రత కల్పించడంలో టెలిమెడిసిన్ ఒక ముఖ్యమైన సాంకేతిక సాధనంగా ఉద్భవించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా స్మార్ట్ సిటీలు నగరంలోని వైద్య బృందాల (గుర్తింపు పొందిన ధృవీకృత వైద్యులు మరియు ఆరోగ్య నిపుణులు) సమన్వయంతో పౌరులకు ఆన్ లైనులో సంప్రదింపుల ద్వారా వైద్య సలహాలు అందించే ఏర్పాట్లు చేశాయి. నీతి ఆయోగ్, భారత వైద్య మండలి సమన్వయంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శక సూత్రాలు లాక్ డౌన్ సమయంలో సుదూరంగా ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు అనుమతిని ఇస్తున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం టేలిఫోన్, వాచక సందేశం లేక వీడియో సంభాషణ – చాట్, చిత్రాలు, మెసేజ్, ఈ మెయిల్ , ఫాక్స్ మరియు ఇతర పద్ధతులలో డాక్టర్లు రోగులతో మాట్లాడి ఔషద నిర్ణయం చేసి మందుల చీటీ రాసేందుకు మార్గదర్శకాలు అనుమతిస్తాయి. అందువల్ల పౌరులు ఇంటి నుంచి బయటికి వెళ్ళవలసిన అవసరం, కోవిడ్ -19 వ్యాప్తి ముప్పు లేకుండా గుర్తింపుపొందిన వైద్యులను సంప్రదించి వైద్య సలహాలు పొందవచ్చు. స్మార్ట్ సిటీలు ఈ దిశలో చేపట్టిన కొన్నికీలక చర్యలను దిగువ వివరించడం జరిగింది.

మధ్యప్రదేశ్:
భోపాల్ నగరంలో ఏకీకృత పర్యవేక్షణ మరియు నియంత్రణ కేంద్రాన్ని (ఐసిసిసి) హెల్ప్ లైనుగా మరియు పౌరులకు టెలి కౌన్సెలింగ్ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. దానిని 104 నెంబరుతో ఏకీకృతం చేసి ఐసిసిసి టోల్ ఫ్రీ నెంబర్లను ప్రచురించారు. ఐసిసిసి కేంద్రంలో ఉన్న ఆపరేటర్లకు ఫోన్ కాల్స్ తీసుకోవడంలో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సహాయం అందించడానికి వివిధ షిప్టులలో ఐసిసిసి కేంద్రంలో వైద్యాధికారులు కూడా ఉంటారు.

ఉజ్జయినిలోని ఐసిసిసిలో ఇద్దరు డాక్టర్లు 24 గంటలు ఉంటారు. వీడియో కాన్ఫరెన్సు/ టెలిఫోన్ కాల్స్ ద్వారా పౌరులతో మాట్లాడి రోగాలక్షణాల ఆధారంగా తగిన సూచనలు చేస్తారు. ఈ డాక్టర్లు రాసే మందులను 40 సంచార మందుల యూనిట్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

జబల్పూర్ లో సత్వర సేవలు అందించే బృందంతో పాటు వార్డుల వారీగా సంచార సేవల యూనిట్ కూడా ఏర్పాటు చేశారు. వీరు అనుమానితుల స్క్రీనింగ్ , అంబులెన్స్, క్వారెంటైన్ మొదలగు సేవలను ఐసిసిసి కేంద్రంలో ఉన్న అధికారుల సమన్వయంతో నిర్వహిస్తారు. పౌరులకు హెల్ప్ లైన్ ద్వారా తక్షణ వైద్య సహాయం అందించడానికి వైద్య బృందం ఐసిసిసిలో ఉంటుంది. +917222967605 నెంబరుకు వాట్స్ యాప్ వీడియో కాల్ ద్వారా పౌరులు టెలిమెడిసిన్ మరియు వీడియో సంప్రదింపులు జరుపవచ్చు. క్వారెంటైన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తుండటంతో పాటు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కోవిడ్-19 గురించిన ప్రశ్నలకు బదులిచ్చే బాధ్యతను ఆపరేటర్లకు అప్పగించారు.

గ్వాలియర్ లో 24X7 కౌన్సెలింగ్ కోసం ఐసిసిసిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. తొలిదశలో పౌరులు అడిగే ప్రశ్నలకు శిక్షణ పొందిన నిపుణులు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ఆ తరువాత ఆ కాల్ ను సంబంధిత వైద్యునికి కలుపుతారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పౌరులు/కాల్ చేసేవారిలో భయాలను తగ్గిస్తున్నది. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటె డాక్టర్ ను సంప్రదించవలసిందిగా వారిని ప్రోత్సహించడం జరుగుతోంది.

సాత్నా , సాగర్ లలో డాక్టర్లు ఐసిసిసిలోనే ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్సు / టెలిఫోన్ కాల్ ద్వారా పౌరులతో మాట్లాడి రోగ లక్షణాల ఆధారంగా తగిన సలహాలు ఇస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ :
కాన్పూర్ స్మార్ట్ సిటీలో ఐసిసిసి నుంచి ఆరోగ్య సేవలను అందజేస్తున్నారు. నగర పాలనా యంత్రాంగం ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఈ సౌకర్యం కోసం 8429525801 నెంబరుకు ఫోన్ చేయాలనీ ప్రజలను కోరారు.

ఆలీగర్ లో డాక్టర్లు ఆలీగర్ స్మార్ట్ సిటీలోని ఐసిసిసి కేంద్రం నుంచి సేవలు అందిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాన్నం 2 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 మధ్య ప్రత్యేక వాట్స్ యాప్ నెంబరు ద్వారా వీడియో కాన్ఫరెన్సు సౌకర్యంతో పౌరులకు అందుబాటులో ఉండి టెలిమెడిసిన్ అందిస్తున్నారు.
వారణాసిలో డాక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

మహారాష్ట్ర :
దగ్గు, జ్వరం మరియు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ రోగలక్షణాలు ఉన్న పౌరుల సౌకర్యం కోసం నాగపూర్ నగరపాలక సంస్థ కరోన వైరస్ మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. పౌరులు దానిలో తమ రోగలక్షణాలను నింపి పంపాలి. దానిని విశ్లేషించే మొబైల్ అప్లికేషన్ ఆ సమాచారం పంపినవారికి రోగలక్షణాలు ఉన్నాయా లేదా కనుగొంటుంది. ఒక వేళ రోగ లక్షణాలు ఉంటే ఆ మొబైల్ అప్లికేషన్ నాగపూర్ నగరపాలక సంస్థ డాక్టర్లకు రోగి సమాచారం అందజేస్తుంది. వారు పర్యవేక్షణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటారు.

కర్ణాటక:
మంగళూరులో కరోనాకోసం ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాని నెంబరు 1077. పౌరులకు టెలిమెడిసిన్ సౌకర్యం కల్పించడంతో పాటు స్వయం క్వారెంటైన్ కోసం ఈ కేంద్రం ద్వారా సలహాలు ఇస్తారు. మంగళూరు కార్పోరేషన్, పోలీసులు మరియు డాక్టర్లు పర్యవేక్షణ మరియు నియంత్రణ కేంద్రంలో ఉండి పౌరుల నుంచి వచ్చే కాల్స్ కు స్పందించి తగిన సమాచారం అందజేస్తారు.

తమిళనాడు:
చెన్నైలోని ఐసిసిసిలో 25 మంది డాక్టర్లు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఒక్కొక్క డాక్టరుకు క్వారెంటైన్ లో ఉన్న 250 మంది బాధ్యత అప్పగించారు. వారు రోగులకు నైతిక, మానసిక బలాన్ని చేకూర్చడంలో తమ సహచరులకు సలహాలు ఇస్తారు. అవసరమైతే వారు మందులు కూడా సూచిస్తారు. సలహాల కోసం 118 అనుమానిత కేసులను ఆరోగ్య నిపుణులకు జత చేశారు. అనుమానిథ కేసుల సమాచారం మరియు వైద్యచరిత్ర సేకరించి ఉంచారు. అవసరమైన సలహాలు ఇవ్వడం జరిగింది.

గుజరాత్:
అనుమానిత కరోనా రోగులు లేక హోం క్వారెంటైన్ లో ఉన్నవారిని ముందు జాగ్రత్తలు తీసుకొని తొలుత వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాత్రమే పరీక్షలు జరపాలని గాంధీనగర్ ఆరోగ్య బృందం (నిపుణులైన డాక్టర్లు) సూచించింది. గాంధీనగర్ అన్ని సెక్టార్లలో ఉన్న సరుకుల దుకాణాల ఫోన్ నెంబర్లను గాంధీనగర్ నగర పాలక సంస్థ వెబ్ సైట్ ద్వారా పౌరులకు తెలిపారు.

రాజస్థాన్:
కోటా స్మార్ట్ సిటీలో సుదూర డిజిటల్ వైద్య సంప్రదింపుల ద్వారా పౌరులకు సేవలు లభ్యమవుతున్నాయి. స్థానిక మందుల దుకాణాలను కూడా వారికి కలుపుతున్నారు.
న్యూ టౌన్ కోల్కతాలో స్కైప్ వినియోగించి టెలి మెడిసిన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.