కరోనాపై సంక్షిప్త వార్తలు

కరోనాపై సంక్షిప్త వార్తలు.

*1.కరోనావైరస్ సవాలును ఎదుర్కోవటానికి సార్క్ దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు; భారతదేశం త‌ర‌ఫున 10 మిలియన్ డాలర్లతో అత్యవసర స‌హాయ‌ నిధిని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించారు.
*2.COVID-19 వైర‌స్ నిరోధానికి వివిధ రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యల ప‌రిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ సమీక్షించారు.
*3.ఇరాన్ లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి గురైన టెహ్రాన్ , షిరాజ్ ప్రాంతాల నుంచి 53 మంది భారతీయులతో కూడిన‌ నాల్గవ బ్యాచ్ స్వ దేశానికి చేరుకున్నారు.
*4.మధ్యప్రదేశ్ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశం ఈ రోజు ప్రారంభమవుతుంది; కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది.
*5.అమెరికా ఫెడరల్ రిజర్వ్ విభాగం కీల‌క‌మైన వడ్లీ రేట్ల‌ను త‌గ్గించింది. పెరుగుతున్న కరోనావైరస్ ప్ర‌భావం ద‌రిమిళా ఈ చ‌ర్య తీసుకుంది.
*6.బర్మింగ్ హ్యామ్ లో జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో తైవాన్ కు చెందిన తాయ్ జూ యింగ్ మూడవ సారి మహిళల సింగిల్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

*PM -SAARC:
–కరోనా వైరస్ విషయంలో సార్క్ దేశాలు కలిసి సిద్ధం కావాలని దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. అదే విధంగా కలిసి పనిచేయాలనీ, విజయవంతం కావాలనీ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సార్క్ సభ్య దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో తన ప్రారంభ ఉప‌న్యాసంలో మాట్లాడుతూ మోడీ – ఈ ప్రాంతంలో వైరస్ తో పోరాడటానికి ఒక ప‌టిష్ట‌మైన ఉమ్మ‌డి వ్యూహాన్ని రూపొందించడానికి అన్ని అంశాల‌ను పంచుకోవాల‌ని కోరారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి ఎలా మ‌లుపుతిరుగుతుందో ఖ‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని అన్నారు. ఇప్పటివరకు సార్క్ ప్రాంతంలో 150 కన్నా తక్కువ క‌రోనా కేసులు ఉన్నాయని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సార్క్ దేశాల స్వచ్ఛంద సహకారం ఆధారంగా కోవిడ్- 19 కోసం భారత్ తరఫున పది మిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. పరీక్షా వస్తు సామాగ్రి, ఇతర పరికరాలతో పాటు వైద్యులు, నిపుణుల వేగ‌వంత‌మైన స్పంద‌న ద‌ళాన్ని భారత్ సమాయ‌త్త‌పరుస్తోందని మోడీ అన్నారు. వైరస్ ను క‌లిగి ఉన్న వారు , వారితో సంబంధం క‌లిగి ఉన్న వ్యక్తులను బాగా గుర్తించడానికి భారతదేశం స‌మ‌గ్ర‌మైన వివ‌రాల‌తో ఒక నిఘా పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని మోడీ చెప్పారు. పొరుగు వారికి మ‌న‌ సహకారం ప్రపంచానికి ఒక ఆద‌ర్శ‌వంతంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. కోవిడ్ అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేయాలన్న మోడీ సూచనను మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ స్వాగతించారు. ప్రాంతీయ దేశాలకు టెస్టింగ్ కిట్లు వంటి సహాయం అందించినందుకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే- ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని -ప్రధాని మోడీ సూచించిన వివిధ కొత్త కార్యక్రమాలను స్వాగతించారు, అభివృద్ధి చెందుతున్న పరిస్థితులపై అన్ని దేశాలు నెలరోజుల పాటు దృష్టి పెట్టాలని సూచించారు. తమ‌ దేశానికి చెందిన 23 మంది విద్యార్థులను వుహాన్ నుంచి తిరిగి తీసుకువచ్చినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ ను ఎదుర్కోవటానికి ఒక గొప్ప‌ సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించడానికి క‌లిసిక‌ట్టుగా చేస్తున్న కృషి ప్రాముఖ్యతను నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఒలి గుర్తించారు. COVID స‌హాయ‌నిధి ఏర్పాటును భూటాన్ ప్రధాన మంత్రి డాక్టర్ లోటే థెరింగ్ స్వాగతించారు, వైరస్ ను ఎదుర్కోవడంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల సహకారాన్ని అభినందించారు. పాకిస్తాన్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాఫర్ మీర్జా -తమ దేశ ఉమ్మ‌డి ప్రాంతీయ ఆందోళనలను పంచుకున్నారని అభిప్రాయప‌డ్డారు.

*HARSH VARDHAN-COVID 19:
-కరోనా వైరస్ వ్యాప్తిపై దేశవ్యాప్తంగా అప్రమత్తతను ప్రకటించిన నేపథ్యంలో, వైరస్ నిరోధానికి వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లపై తాజా పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలో సమీక్షించారు. కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, నిర్విరామంగా పనిచేసే హెల్ప్ లైన్ నంబర్ 011-23978046 హెల్ప్ లైన్ నంబర్ సామర్థ్యాన్ని పెంచవలసిందిగా డాక్టర్ హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిపై అంతర్జాతీయంగా పలుదేశాల్లో, దేశంలో నెలకొన్న పరిస్థితిని, గురించి అధికారులు ఈ సమీక్షలో కేంద్రమంత్రికి వివరించారు. వైరస్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలను కూడా అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రాష్ట్రాల్లో వైరస్ నిరోధక ఏర్పాట్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి, జనంలో అవగాహనను పెంచేందుకు ఇకపై తీసుకోవలసిన చర్యల గురించి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సమీక్షలో చర్చించారు. జన సమూహాలకు దూరంగా ఉండటం, వర్క్ ఫ్రం హోమ్ వంటి జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలపై కూడా మంత్రి చర్చించారు. నిన్న ఢిల్లీలో జరిగన ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలను ఈరోజు జరిగే మంత్రుల గ్రూపు సమావేశంలో చర్చకు ప్రవేశపెడతారు.

*INDIA-IRAN-EVACUATION
– ఇరాన్ లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి గురైన టెహ్రాన్ , షిరాజ్ ప్రాంతాల నుంచి 53 మంది భారతీయులతో కూడిన‌ నాల్గవ బ్యాచ్ స్వ దేశానికి చేరుకుంది. ఈ తాజా బృందంలో 52 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒక ట్వీట్‌లో తెలిపారు. దీంతో మొత్తం 389 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. భారతీయులను తరలించడానికి వీలు కల్పించినందుకు ఇరాన్ అధికారులకు డాక్టర్ జై శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత రాయబారి, ఇతర అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.

కరోనా వైరస్
-తెలంగాణలో కరోనా వైరస్ 3వ పాటిటీవ్ కేసు నమోదైనట్లు నిన్న వైద్యారోగ్యశాఖ అధికారులు తెలియజేశారు.


*HEALTH ADVISORY:
-కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రజలు మౌలికమైన తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. ఎక్కువమంది గుమికూడే జన సమూహాలకు ప్రజలు దూరంగా ఉండాలని, చేతులు శుభ్రం చేసుకోకుండా తమ కళ్లను, ముక్కును, నోటిని చేతులతో తాకడం, తుడుచుకోవడం చేయరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. తరచుగా సబ్బుతో నీటితో చేతులు కడుక్కోవాలని సూచించింది. దగ్గినపుడు, ముక్కు చీదినపుడు జేబురుమాల, టిష్యూ పేపర్ వినియోగించాలని, వాడిన టిష్యూ పేపర్లను వెంటనే మూసివేసిన చెత్తబుట్టలో వేయాలని కూడా సూచించింది. ఒక వేళ జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు ఉంటే తక్షణం వైద్యుణ్ణి సంప్రదించాలని, డాక్టర్ ను సందర్శించేటపుడు మాస్కు ధరించి వెళ్లాలని సూచించింది.