కరోనాలో కోట్ల రూపాయల కటాక్షం..కో అంటే కోటీ..

క‌రోనా మహామ్మారితో యావ‌త్ ప్ర‌పంచం క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కొంటున్న వేళ దుబాయ్‌లోని భార‌తీయుడికి ల‌క్ష్మీ క‌టాక్షం ల‌భించింది. ఓవైపు లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు, అంద‌రూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌తీయ సేల్స్‌మెన్‌కు అదృష్ట‌దేవత వ‌రించింది. ల‌క్కీ లాట‌రీలో 20 కోట్ల‌రూపాయ‌లు గెలుచుకుని కోటీశ్వ‌రుడు అయ్యాడు ఓ భార‌తీయ సేల్స్‌మెన్‌.

కేర‌ళ‌లోని త్రిచూర్‌కు చెందిన దిలీప్‌కుమార్ ఎల్లికొట్టిల్ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఉపాధి కోసం 17 ఏళ్ల నుంచి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ లోని అజ్మాన్ న‌గ‌ర్‌లో ఉంటున్నాడు. అక్క‌డే ఓ ఆటోమొబైల్ కంపెనీలో సేల్స్‌మెన్ గా ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల‌ ముందు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తారీఖున బిగ్‌ టికెట్ డ్రా పేరుతో నిర్వహించే లాటరీ టికెట్‌ను రూ.10వేలు పెట్టి కొనుగోలు చేశాడు. ఈ సారి తీసిన లాటరీ డ్రాలో దిలీప్‌ సుమారు రూ.20 కోట్లు గెలుచుకున్నట్లు స్థానిక వార్త సంస్థ తెలిపింది. చాలీచాల‌నీ వేత‌నంలో కాలం వెల్ల‌దీస్తున్న దిలీప్‌కుమార్ కు లాట‌రీ టికెట్ త‌న విధిరాత‌ను మార్చేసింది. సేల్స్‌మెన్ నుంచి కోటీశ్వ‌రుడుగా మార‌డంతో ఆయ‌న కుటుంబంలో సంతోషం వెళ్లివిరిసింది. కాగా, గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ముతో తనకున్న బ్యాంక్ రుణాల‌కు చెల్లించి, మిగిలిన సొమ్మును తన ఇద్దరు పిల్లల చదువుల కోసం ఖ‌ర్చుచేయ‌నున్న‌ట్టు తెలిపాడు దిలీప్‌కుమార్‌.