కోవిడ్-19 CSIR-CFTRI ప‌రీక్షా ప‌రిక‌రాలు

మైసూరులో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 28 కి చేరింది. ఇందులో గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన కేసులు ఏడు. క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ ఈ విష‌యం తెలిపింది. ఇదిలా ఉండ‌గా మైసూరుకు చెందిన సిఎస్ ఐఆర్‌- సెంట్ర‌ల్ ఫుడ్ టెక్న‌లాజిక‌ల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CSIR-CFTRI)లు జిల్లా పాల‌నాయంత్రాంగంతో క‌ల‌సి సంయుక్తంగా క‌రోనా వైర‌స్ న‌మూనాల ప‌రీక్షల‌కు అవ‌స‌ర‌మైన న‌మూనాల‌ను అందుబాటులో ఉంచుతోంది.

కోవిడ్ -19 ఇన్‌ఫెక్ష‌న్‌ను ప్ర‌స్తుతం అత్యంత అధునాత‌న‌, సంక్షిప్త టెక్నిక్ అయిన రియ‌ల్ టైమ్ పాల‌మ‌రేజ్ చెయిన్ రియాక్ష‌న్ (PCR) ప‌ద్ధ‌తిలో గుర్తిస్తున్నారు. ఈ పిసిఆర్ ప‌ద్ధ‌తిలో న‌మూనాల నుంచి వైర‌స్ ఆర్ ఎన్ ఎ ను సేక‌రించి దానిని పిసిఆర్ ప‌రిక‌రం ద్వారా పెంపొందింప‌చేస్తారు. దీనివ‌ల్ల ఆయా వ్య‌క్తుల‌లో వైర‌స్‌ను అత్యంత ప్రాథమిక ద‌శ‌లోనే గుర్తించ‌డానికి వీలు క‌లుగుతుంది. అంటే ల‌క్ష‌ణాలు ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే దీనిని గుర్తించ‌వ‌చ్చు.

పెద్ద ఎత్తున‌ అనుమానిత వ్యాధిగ్ర‌స్తులు ఉన్న నాలుగు హాట్ స్పాట్ జిల్లాల్లో మైసూర్ జిల్లా ఒకటిగా గుర్తించబడింది. అనుమానిత వ్యక్తుల శరీరంలో వైరస్ ఉనికిని క్వారంటైన్ కాలానికి ముందు,ఆ త‌ర్వాత‌ పరీక్షించాల్సి ఉంటుంది. వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించినా, క‌నిపించ‌క‌పోయినా ప‌రీక్ష‌లు చేయించ‌డం త‌ప్ప‌నిస‌రి.

CSIR-CFTRI రెండు పిసిఆర్ ప‌రిక‌రాల‌ను, ఓ RNA సేక‌ర‌ణ‌ యూనిట్‌తో పాటు అవసరమైన రసాయనాలను జిల్లా యంత్రాంగానికి అందిస్తోంది. జిల్లాలో పెద్ద ఎత్తున న‌మూనాల‌ను ప‌రీక్షించాల్సి ఉండ‌డంతో వీటిని అందిస్తున్నారు.

ప్ర‌స్తుత స‌మ‌యంలో క‌చ్చిత‌మైన ఫ‌లితాలు ఎంతైనా అవ‌స‌రం. ఈ ప‌రీక్ష‌లు అత్యంత అధునాత‌న‌మైన‌వి. వీటిని ఎంపిక చేసిన, ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చి (ICMR) ఆమోదిత కేంద్రాల‌లో నిర్వ‌హిస్తారు. ప్ర‌స్తుతంం ఉన్న సామ‌ర్ధ్యానికి అద‌న‌పు సామ‌ర్థ్యాన్ని స‌మ‌కూరుస్తున్నామ‌ని సిఎస్ఐఆర్‌-సిఎఫ్‌టిఆర్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ KSMS రాఘ‌వ‌రావు తెలిపారు. ఈ పరిక‌రాల‌తోపాటు, ఇద్ద‌రు నైపుణ్యం క‌లిగిన టెక్నీషియ‌న్ల‌ను జిల్లా పాల‌నాయంత్రాంగానికి అందుబాటులో ఉంచుతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

PCR ప‌రిక‌రాన్ని 2020 ఏప్రిల్ 5న మైసూరులోని మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీ (VRDL), ఇన్-ఛార్జ్ కోవిడ్ టెస్ట్ లాబొరేటరీ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమృత కుమారికి అంద‌జేశారు. రోజూ చేసే కోవిడ్ నిర్ధార‌ణ పరీక్షల సంఖ్యను మూడు రెట్లు పెంచడానికి ఇది సహాయపడుతుందని ఆమె తెలిపారు. RNA సేక‌ర‌ణ‌ యూనిట్ ఓ వారం రోజుల్లో రానుంది.