కరెన్సీ నోట్లకు కరోనా వైరస్?? జాగ్రత్తలు మీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం, వారు కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినట్టు తేలడంతో, కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు.

 

తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోయినా, కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ కాకపోయినా కూడా వారికి కరోనా సోకింది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఏపీలోని పోలీసులకు డీజీపీ కార్యాలయం మెమో జారీ చేసింది. అందులో పలు సూచనలు చేసింది. కేబుల్ టీవీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వారు, పాలు పోసేవారు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, కూరగాయలు షాపులు, పండ్ల దుకాణాలు, మెడికల్ షాపులు కరెన్సీ విరివిగా వాడే అవకాశాలు ఉన్నాయి.

ప్రజలు కరెన్సీ నోట్లను తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు వాటిని శానిటైజ్ చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. 14వ తేదీ నుంచి రెండు వారాల పాటు ఎలాంటి కరెన్సీ కలెక్ట్ చేయవద్దు. నిత్యావసరాలకు సంబంధించి కూడా ఎవరూ రెడ్ జోన్లలోకి వెళ్లొద్దు. రెడ్ జోన్లలో డ్యూటీ చేసే గ్రామ, వార్డు వాలంటీర్లు, పోలీసులకు తప్పనిసరిగా కరోనా టెస్టులు నిర్వహించాలి. ఒకే చోట ఎక్కువ మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దు. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్, ప్రత్యేక బాత్రూమ్ ఉండేలా చూడాలి. జిల్లాల కలెక్టర్లు, DMHOలతో టచ్‌లో ఉంటూ, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. యూపీలోని ‘దియోబందీ’కి హాజరైన ఏపీ వాసులను గుర్తించాలి. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అలాంటి వారు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం క్రయ విక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.