దేశంలో చురుగ్గా గోధుమ పంటల కోతలు

లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా గోధుమ పంట కోత‌లు చురుగ్గా సాగుతున్నాయి. 2020 ఖ‌రీఫ్ వేళ పంటల కోత‌లు మరియు నూర్పిడికి సంబంధించి స‌ర్కారు జారీ చేసిన ఎస్ఓపీల‌ను రైతులు, కార్మికులు పాటిస్తున్నారు. ఈ కోవిడ్‌-19 క‌ఠిన స‌మ‌యంలో రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ, సహకార మరియు రైతుల సంక్షేమ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎస్ఓపీల‌ను పంపిణీ చేసింది.

రాష్ట్రాలందించిన నివేదిక‌ల‌ ప్రకారం మధ్యప్రదేశ్‌లో 98-99 శాతం గోధుమ పంట కోత పూర్త‌యింది. రాజస్థాన్‌లో 92-95 శాతం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 85-88 శాతం, హర్యానాలో 55-60 శాతం, పంజాబ్‌లో 60-65 శాతం, ఇతర రాష్ట్రాల్లో 87-88 శాతం మేర పంట కోత‌లు పూర్త‌య్యాయి. 2020-21 రబీ సీజన్‌లో మద్దతు ధ‌ర‌ పథకం (పీఎస్‌ఎస్) కింద రైతుల నుంచి క‌నిష్ఠ మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) వద్ద పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానాలో జోరుగా ముందుకు సాగుతోంది. లాక్‌డౌన్ స‌మయం‌లో ఈ పంటల సేకరణ కింది విధంగా ఉంది:

– ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి ఐదు రాష్ట్రాల నుండి 72,415.82 ఎంటీల‌ శ‌న‌గ‌లను సేకరించారు.

1,20,023.29 ఎంటీల కందుల‌ను తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మరియు ఒడిశాతో స‌హా 7 రాష్ట్రాల నుండి సేక‌రించ‌డం జ‌రిగింది.

రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా 3 రాష్ట్రాల నుండి 1,83,400.87 ఎంటీల ఆవాలు సేకరించారు. కాగా, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్‌హెచ్‌బీ) దేశ వ్యాప్తంగా 618 ఎన్‌హెచ్‌బీ గుర్తింపు పొందిన నర్సరీల నుండి పండ్లు మరియు కూరగాయాలు “అందుబాటులో ఉన్న మొక్కల పెంపకం” పై సమాచారాన్ని సేకరించింది.