సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి వలపు వలతో 80₹ వేలు స్వాహా చేసిన సైబర్‌ కేటుగాళ్లు

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తూ తన గదిలోనే ఉంటున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. ఖాళీ సమయంలో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఓ వెబ్‌సైట్లో ఫోన్‌ నంబర్‌ కనబడింది. అందమైన అమ్మాయిలతో చాటింగ్‌, వీడియోకాలింగ్‌, ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్‌ చేశాడు. అవతలి వైపు నుంచి ఓ యువతి వలపు వల విసురుతూ మాట్లాడింది. ఆమె మాటలకు ఫిదా అయ్యాడు. తన ఫొటోలు కావాలన్నాడు. అందుకు డబ్బు చెల్లించాడు. ఉత్సాహాన్ని ఆపుకోలేక వీడియో కాలింగ్‌లో మాట్లాడాలన్నాడు. ఆ యువతి అంగీకరించడంతో వీడియో కాల్‌ మాట్లాడాడు. అతడు ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో కాల్స్‌ మాట్లాడిన సందర్భాలున్నాయి.

వాటిని క్యాప్చర్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియో కాల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. భయపడిన సురేష్‌ ముందుగా రూ. 20 వేలు చెల్లించాడు. దశలవారీగా అతడి నుంచి రూ. 80 వేలు కాజేశారు. ఆ తర్వాత సురేష్‌ స్పందించకపోవడంతో ఆ ఫొటోలను అతడి ఖాతాతో ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టారు. బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు సరికొత్త ఎత్తుగడలు, రకరకాల స్కీమ్‌లతో అమాయకులను మోసం చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. పనులు లేక చేతిలో డబ్బు లేక అవస్థ పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు మాత్రం ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు. వారి మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. కరోనా కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ యువత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు.