క్షీణించిన తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆరోగ్యం

క్షీణించిన తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆరోగ్యం

తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను (72) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 13న ఆయన కారులో సేలం వెళ్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే ఆయనను విల్లుపురం ముండియంబాక్కం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడాయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుకు గురైనట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆయన పల్స్ కూడా తగ్గిపోతుండడంతో వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం సోమవారం మరింత క్షీణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం తదితరులు మంత్రి దురైకన్నును పరామర్శించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.