- ఫోటో జర్నలిజంలో సీఎన్ రావు సేవలు చిరస్మరణీయం సంతాప సభలో కొనియాడిన పలువురు నేతలు
దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సీఎన్ రావు సేవలు చిరస్మణీయమని పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు కొనియాడారు. టీయూడబ్ల్యూజే, ఆజాద్‌ల ఆధ్వర్యంలో
గురువారం ఢిల్లీలోని తెలంగాణ–ఏపీ భవన్లో నిర్వహించిన సీఎన్ రావు సంతాప సభలో పలు పార్టీల సీనియర్ నేతలు, జర్నలిస్టులు పాల్గొని ప్రసంగించారు. అందరితో సోదరభావంతో కలిసిపోయే వ్యక్తిత్వం సీఎన్ రావుదని రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి మన మధ్య లో లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి వై.ఎస్. చౌదరి మాట్లాడుతూ సీఎన్ రావు ఢిల్లీ ఫోటోగ్రాఫర్లలో ఎంతో కీర్తి గడించారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలనే చివరి వరకు అనుసరించారని, జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదురైన వ్యక్తిత్వాన్ని ఏ రోజూ వదులుకోని మనిషి సీఎన్ రావు అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఢిల్లీలో పని చేసే ఫోటో జర్నలిస్ట్‌లలో లెజెండ్‌గా సీఎన్ రావు నిలిచారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఘట్టాలను తన కెమెరాలో బంధించి, దేశ రాజధానిలో ఉద్యమ చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఆయన ఉండే వారని తెలిపారు. వృత్తినే కాకుండా, సమాజాన్ని ప్రేమించే ఆయన మనస్తత్వం అందరికీ ఆదర్శనీయమని పలువులు జర్నలిస్టులు కొనియాడారు. సీఎన్ రావు కుటుంబానికి రాజ్యసభ సభ్యులు కేవీపీ రాంచంద్రరావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, టీడీపి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఎన్.సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టులు కృష్ణా రావు, జీకేఎం రావు, ఆనంద్‌కుమార్, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఎస్.ఎన్.సిన్హా, టీయూడబ్ల్యూజే, ఆజాద్ సంఘాల నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.