భారతదేశంలో పెట్టుబడులను పెంచే వ్యూహాలపై చర్చలు

కోవిడ్-19 విశ్వమారి నేపథ్యం లో దేశ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి పరచడానికి స్థానిక పెట్టుబడుల ను ప్రోత్సహించడం తో పాటు మరిన్ని విదేశీ పెట్టుబడుల ను భారతదేశం లోకి ఆకర్షించడం కోసం తగిన వ్యూహాలను గురించి చర్చించడానికి గాను ఒక సమగ్ర సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున నిర్వహించారు.

దేశం లోని ప్రస్తుత పారిశ్రామిక భూములు/స్థలాలు/పారిశ్రామిక వాడల లో అన్ని రకాల అనుమతుల ను వెనువెంటనే అందించేటటువంటి మౌలిక వ్యవస్థ కు పెద్ద పీట వేయడం తో పాటు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సమకూర్చేందుకు ఉద్దేశించిన ఒక పథకాన్ని గురించి కూడాను ఈ సమావేశం లో చర్చించడమైంది. సమావేశం సాగిన క్రమం లో, పెట్టుబడిదారుల కు మార్గదర్శకత్వం వహించే, వారి సమస్యల పట్ల శ్రద్ధ ను వహించే మరియు కాలబద్ధమైన పద్ధతి లో అవసరమైనటువంటి అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర అనుమతుల ను మంజూరు చేసి వారి కి తోడ్పడే మరింత అధిక క్రియాశీల దృష్టికోణాన్ని అలవరచుకోవాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించారు.

భారతదేశంలోకి పెట్టుబడులను శీఘ్రతరమైనటువంటి విధానంలో తీసుకువచ్చే మరియు దేశంలోని వివిధ రంగాలకు దన్నుగా నిలచే వేరువేరు వ్యూహాలపై సమావేశంలో చర్చ చోటు చేసుకొంది. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో రాష్ట్రాలకు వాటి వాటి వ్యూహాలను అవి రూపొందించు కోగలిగేటట్టు గాను, ఈ విషయంలో రాష్ట్రాలు మరింత సక్రియాత్మకంగా వ్యవహరించేటట్టు గాను రాష్ట్రాలకు మార్గదర్శనం చేసే అంశం పై విపులమైన చర్చను చేపట్టడం జరిగింది.

వివిధ మంత్రిత్వ శాఖలు అమలు పరుస్తున్నటువంటి సంస్కరణ కార్యక్రమాలు అదే పనిగా కొనసాగాలన్న అంశం, అదే విధంగా పారిశ్రామిక వృద్ధిలో మరియు పెట్టుబడులకు ప్రోత్సాహంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించేందుకు కాలబద్ధ ప్రణాళిక సాయంతో గట్టి చర్యలను తీసుకొని తీరాలన్న అంశం సమావేశంలో చర్చకు వచ్చాయి.

ఆర్థిక మంత్రి, హోం మంత్రి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రులతో పాటు భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.