కేరళలో జరుగుతున్న దృశ్యం 2 షూటింగ్

కేరళలో జరుగుతున్న దృశ్యం 2 షూటింగ్

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన ‘దృశ్యం’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. ఆ సినిమాను సీనియర్ నటి శ్రీప్రియ తెలుగులో వెంకటేశ్ కథానాయకుడిగా రీమేక్ చేసింది. మలయాళంలో తను చేసిన పాత్రనే తెలుగులోనూ మీనా చేసింది. 2014లో వచ్చిన ఆ సినిమా ఇక్కడ కూడా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ కెరియర్ లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.ఇక ఇటీవలే మలయాళంలో ‘దృశ్యం 2’ పేరుతో సీక్వెల్ వచ్చింది. ఈ సీక్వెల్ కూడా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏ సినిమా సీక్వెల్ అయినా మొదటి భాగం ఆగిపోయిన చోటు నుంచే మొదలుకావడం అనేది అరుదు. ఈ సినిమా సీక్వెల్ మాత్రం ఫస్టు పార్టు ఆగిపోయిన చోటు నుంచే మొదలవుతుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి సంతృప్తిని కలిగిస్తుంది. మలయాళంలో ‘దృశ్యం 2’ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులోనూ ‘దృశ్యం 2’ చేస్తున్నాడు. క్రితం నెల 1వ తేదీనే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే 40 నుంచి 50 శాతం వరకూ షూటింగు పూర్తయిందని అంటున్నారు. ప్రస్తుతం కేరళలో వెంకటేశ్ .. మీనా .. నదియాపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ స్పీడ్ చూస్తుంటే ‘దృశ్యం 2’ సాధ్యమైనంత త్వరగానే థియేటర్లలో దిగిపోయేలా అనిపిస్తోంది.