మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ కన్నుమూత

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ కన్నుమూత

కరోనాతో 3 రోజులుగా చికిత్స

రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మృతి.. 2015లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం

ములుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే

వరంగల్‌ నుంచి రెండుసార్లు లోక్‌సభకు

ఎన్టీఆర్‌, కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి

కేసీఆర్‌ సంతాపం.. గిరిజనుల అభివృద్ధికి కృషిచేశారని నివాళి

టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (66) కన్నుమూశారు. కొన్నాళ్లుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స అందిస్తుండగానే 11 గంటలకు ఆయన కన్నుమూశారు. చందూలాల్‌కు భార్య శారద.. కుమార్తె పద్మ, కుమారులు ధరమ్‌సింగ్‌, ప్రవీణ్‌ ఉన్నారు. చందూలాల్‌ స్వస్థలం భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జగన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లి. 1954 ఆగస్టు 17న చందూలాల్‌ జన్మించారు. తల్లిదండ్రులు మీరాబాయి-మీటూనాయక్‌. హెచ్‌ఎ్‌ససీ దాకా చదివారు. సర్పంచ్‌ స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా (1996, 1998) గెలుపొందారు. 1981లో తొలిసారి ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1994లో ఆ స్థానం నుంచే రెండోసారి గెలిచారు.

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 నుంచి 2005 వరకు ఆంధ్రప్రదేశ్‌ ట్రైకార్‌ చైర్మన్‌గా సేవలందించారు. అంతకు ముందు 2001 నుంచి 2003 వరకు ట్రైకార్‌ జాతీయ డైరెక్టర్‌గా పనిచేశారు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2006లో టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ పార్టీ తరఫున 2014లో ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్‌ కేబినెట్‌లో గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో కిడ్నీ సంబంధిత వ్యాధికి గురైన ఆయనకు అదే ఏడాది శస్త్రచికిత్స చేసి కిడ్నీ అమర్చారు.ఆ తర్వాత కోలుకున్న ఆయన మంత్రిగా పూర్తి సమయం కొనసాగారు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ములుగుకు రెవెన్యూ డివిజన్‌ హోదా తేవడంలో, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో తెలంగాణకు మంజూరైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు శివారులో ఏర్పాటు చేయడంలో కృషిచేశారు. చందూలాల్‌ అంత్యక్రియలు స్వగ్రామమైన సారంగపల్లిలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చందూలాల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. చందూలాల్‌ మృతిపట్ల మంత్రి ఈటల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు..