మేము సైతం మాజీ సైనికులు

దేశంలో కోవిడ్19 మహామ్మారికు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి సహాయం అందించడంలో తమ వంతు పాత్రను నిర్వహించడానికి మాజీ సైనికోద్యోగులు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు.

కరోనా వైరస్ (కోవిడ్-19)కు వ్యతిరేకంగా జాతి యావత్తూ కొనసాగిస్తున్న పోరాటంలో భాగంగా పౌర పాలనా యంత్రాంగానికి సహాయపడాలని-సైన్యం, నావికాదళం, వైమానిక దళాలకు చెందిన మాజీ సైనికోద్యోగులు (ESM), స్వచ్చందంగా, నిస్వార్ధంగా ముందుకు వచ్చారు. రక్షణ మంత్రిత్వశాఖ (MOD) పరిధిలోని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ శాఖ (DESW) ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తోంది. కేంద్రీయ సైనిక్ బోర్డు తో పాటు, రాష్ట్ర స్థాయిలో ఉన్న 32 రాజ్య సైనిక్ బోర్డులు, దేశవ్యాప్తంగా ఉన్న 403 జిల్లా సైనిక్ బోర్డుల నెట్ వర్క్ ద్వారా మాజీ సైనికోద్యోగులందరినీ సంప్రదిస్తున్నారు.

కర్ణాటక :
కర్ణాటక వ్యాప్తంగా కార్యకలాపాలను బ్రిగేడియర్ రవి మునిస్వామి (రిటైర్డ్) సమన్వయ పరుస్తున్నారు. బెంగళూరులో 45 మంది ప్రముఖ సైకిల్ రైడర్లతో కూడిన బృందానికి ఆయన నాయకత్వం వహించి, ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా నగరంలోని వృద్దులు, రోగులకు మందులు, నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్నారు. వీరితో పాటు, ధార్వాడ్, దావణగెరె, శివమొగ్గ, హస్సన్, మైసూరు, కొడగు లోని పలువురు మాజీసైనికోద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆహార పదార్ధాల సరఫరా, లాక్ డౌన్ నిర్వహణలో సహకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్ లో సుమారు మూడు వందల మంది మాజీ సైనికోద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాష్ట్ర పోలీసులకు సహకరిస్తున్నారు. తాడేపల్లిగూడెం లోని పశ్చిమగోదావరి జిల్లా మాజీ సైనికోద్యోగుల సంఘం వంటి కొన్ని సంఘాలు, మంగళగిరి లోని 28 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ ఈ.ఎస్.ఎం. సంస్థ పేద ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాయి. భీమునిపట్నం లోని శ్రీ చైతన్య ఈ.ఎస్.ఎం. సంఘం లాక్ డౌన్ నిర్వహణలో పోలీసులకు సహకారం అందిస్తోంది.

ఉత్తరప్రదేశ్ :
ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాల సైనిక్ బోర్డులుకు చెందిన మాజీ సైనికోద్యోగులు రేషన్ పంపిణీ, కమ్యూనిటీ నిఘా తో పాటు అవసరమైన వారికి కమ్యూనిటీ కిచెన్ కూడా నిర్వహిస్తున్నట్లు బ్రిగేడియర్ రవి (రిటైర్డ్) తెలియజేశారు. సీనియర్ మాజీ సైనికోద్యోగులకు కూడా వీరు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఆర్మీ మెడికల్ దళానికి చెందిన 6,592 మంది మాజీ సైనికోద్యోగులను ఇప్పటికే గుర్తించి, సంప్రదించి, అత్యవసర సేవల కోసం వారిని సిద్ధంగా ఉంచడం జరిగింది.

పంజాబ్ :
రాష్ట్రంలో 4,200 మంది మాజీ సైనికోద్యోగులను పరిపాలన సంరక్షకులుగా నియమించినట్లు పంజాబ్ రాజ్య సైనిక్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడియర్ సతిందర్ సింగ్ (రిటైర్డ్) తెలియజేసారు. వీరు పంజాబ్ లోని ప్రతి గ్రామంలో సమాచారాన్ని సేకరించి, కమ్యూనిటీ నిఘా లో సహకరిస్తారు.

ఛత్తీస్ గఢ్ :
బిలాస్పూర్, జాంజ్గిర్, కోర్బా లలో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించడం కోసం కేవలం కొంతమంది మాజీ సైనికోద్యోగులను మాత్రమే ఇంతవరకు నియమించినట్లు, ఛత్తీస్ గఢ్ లో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఎయిర్ కమాండర్ ఏ.ఎన్.కులకర్ణి వి.ఎస్.ఎం. (రిటైర్డ్) తెలియజేశారు.

ఈశాన్య ప్రాంతం :
అస్సాం లోని 19 జిల్లాల్లో సహకరించడానికి మూడు వందల మంది మాజీ సైనికోద్యోగుల బృందంతో బ్రిగేడియర్ నారాయణ్ దత్ జోషి, ఎస్.ఎం. (రిటైర్డ్) సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా, షిల్లాంగ్ లో పౌర పరిపాలనా విభాగానికి సహకారం అందించడానికి 79 స్వచ్చంద కార్యకర్తలతో కల్నల్ గౌతమ్ కుమార్ రాయ్ (రిటైర్డ్) సంసిద్ధంగా ఉన్నారు. మాజీ సైనికోద్యోగుల జాబితాను రాష్ట్ర, జిల్లా పాలనా యంత్రాంగాలకు అందజేసినట్లు బ్రిగేడియర్ జే.పి.తివారి (రిటైర్డ్) తెలియజేశారు. వారికి కేటాయించే ఏ పనైనా నిర్వర్తించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఝార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్ :
అదేవిధంగా, ఝార్ఖండ్ నుండి బ్రిగేడియర్ పాథక్ (రిటైర్డ్); హర్యానా నుండి కల్నల్ రాహుల్ యాదవ్ (రిటైర్డ్); ఉత్తరాఖండ్ నుండి బ్రిగేడియర్ కే.బి. చాంద్ (రిటైర్డ్) కూడా తమ తమ రాష్ట్రాలలో అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

దేశం యావత్తూ ఏక కాలంలో లాక్ డౌన్ లో ఉన్న సమయంలో సైన్యం, నావికాదళం, వైమానిక దళాలకు చెందిన రిటైర్డ్ సిబ్బంది స్పందనతోపాటు మాజీ సైనికోద్యోగుల సంఘాలు అందజేస్తున్న స్వచ్చంద సేవలు చాలా ప్రశంసనీయం.