దిల్లీలోని ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’ (ఎన్జీఎంఏ)ను లాక్డౌన్ కారణంగా తత్కాలికంగా మూసివేసినా, సరికొత్త దారిలో ప్రదర్శన ఉత్సాహన్ని కొనసాగిస్తున్నారు. “ఎన్జీఎంఏ కే సంగ్రహ్ సే” ప్రదర్శనను వర్చవల్ పద్ధతిలో తీసుకొచ్చారు. తన సంగ్రహాలయంలోని అరుదైన, ఇప్పటివరకు ఎవరూ చూడని కళాఖండాలను ఎన్జీఎంఏ ప్రదర్శించనుంది. ఎన్జీఎంఏ ప్రతిష్టాత్మక సేకరణల నుంచి వారం/రోజువారీ థీమ్‌ల పద్ధతిలో ఈ ప్రదర్శనలు ఇస్తారు.
7 మే 2020న ఠాగూర్ 159వ జయంతి
ఈ వారపు థీమ్ అయిన ‘ఆర్టిస్ట్ బై ఆర్టిస్ట్స్’ను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు అంకితం చేశారు. 7 మే 2020న ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు. మరిన్ని ఉత్సాహభరిత, ఆలోచింపజేసే థీమ్లోను రానున్న రోజుల్లోనూ ప్రదర్శిస్తారు. కళాకారులు, కళాప్రియులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు అరుదైన కళాఖండాలను ఇంటి నుంచే చూసే అవకాశాన్ని ఈ వర్చువల్ ప్రదర్శన అందిస్తోంది.
జామినీ రాయ్, రాజా రవివర్మ వంటి మహామహులపై నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ గతంలోనూ వర్చువల్ ప్రదర్శనలు ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ నృత్య దినోత్సవం, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం వంటి అంతర్జాతీయ రోజుల స్మారకార్థం వర్చువల్ పద్ధతిలో శాశ్వత సేకరణలను కూడా పంచుకుంది.
ఎన్జీఎంఏ డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత చరణ్ గర్నాయక్ మాట్లాడుతూ, “కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా ప్రదర్శనశాలను మూసేయడం మా స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయింది, మా సందర్శకులతో కలవకుండా మమ్మల్ని ఆపలేకపోయింది. పైగా, వెబ్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కలవడానికి మాకు ఉత్సాహభరితమైన కొత్త అవకాశాన్ని అందించింది. మా ప్రయత్నాలను సమాజం ఎంతో చక్కగా స్వాగతించింది. భవిష్యత్తులోనూ ఇదే దారిలో కొనసాగగలమని ఆశిస్తున్నాం.”