తప్పుడు ప్రచారం చేస్తే ఒళ్లు జాగ్రత్త: కేంద్రం

– రాష్ర్టాలు, కేంద్ర పాలిక ప్రాంతాల‌కు హోం శాఖ లేఖ‌
– త్వ‌ర‌లో వాస్త‌వాల‌తో అందుబాటులోకి ప్ర‌త్య‌క పోర్ట‌ల్‌

కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా ఇటీవ‌ల కొన్ని అవాస్త‌వ వార్త‌లు ప్ర‌చారంలోకి రావడంపై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయింది. ఇలాంటి అవాస్త‌వ వార్త‌ల‌ను నియంత్రించేందుకు గాను.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కొన‌సాగింపుగా కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్ బ‌ల్లా అన్ని రాష్ర్టాలు, కేంద్ర‌పాలిక ప్రాంతాల‌కు ఒక లేఖ రాశారు.

అవాస్త‌వ వార్త‌ల‌తో పోరాడేందుకు, ఇలాంటి వార్త‌లు విరివిగా ప్ర‌చారంలోకి రాకుండా ఉండేందుకు గాను త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆ లేఖ‌లో కోరారు. ప్ర‌జ‌లు వాస్త‌వాల‌ను తెలుసుకొనేందుకు, ధ్రువీక‌రించుకోకుండానే ప్ర‌చారంలోకి వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వాల‌ను తెలియప‌రిచేందుకు గాను భార‌త ప్ర‌భుత్వం వెబ్‌పోర్ట‌ల్ ఒక దానిని రూపొందిస్తున్న‌ట్టు హోం శాఖ ఈ లేఖ‌లో పేర్కొంది. అవాస్త‌వా వార్త‌ల‌కు వివ‌ర‌ణ‌ల‌ను ఇచ్చేందుకు వాటికి సంబంధించిన స‌మాచారాన్ని ప్ర‌జల‌కు అందించేందుకు గాను రాష్ర్టాలు, కేంద్ర‌పాలిక ప్రాంతాలు కూడా ఇలాంటి వ్య‌వ‌స్థ‌ల‌నే ఏర్పాటు చేసుకోవాల‌ని కూడా హోంశాఖ కోరింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికులు భారీగా త‌మ త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నార‌ని.. లాక్డౌన్ మ‌రో మూడు నెల‌ల‌కు పైగానే కొన‌సాగే అవ‌కాశం ఉందంటూ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు వ‌ల‌స‌దారుల్లో తెలియ‌ని ఆందోళ‌న, భ‌యాల‌కు దారి తీస్తోందంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ఇటీవ‌ల ఒక రిట్‌ పిటిష‌న్‌ దాఖ‌లైంది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన దేశ సుప్రీంకోర్టు నిజాలు తెలుసుకోకుండా మీడియాలో వ‌స్తున్న వార్త‌లు ప్ర‌జ‌ల్ని చెప్ప‌లేని బాధ‌ల‌కు గురి చేస్తోందంటూ అభిప్రాయ‌ప‌డింది. వాస్త‌వాల‌ను నిర్ధార‌ణ చేసుకున్న త‌రువాతే మీడియా సంస్థ‌లు వార్త‌ల‌ను ప్ర‌చారం లేదా ప్ర‌సారం చేయాల‌ని ఆదేశాల‌ను జారీ చేసింది. దీనికి తోడు వ‌ల‌స కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల‌లో ఎన్‌డీఎంఏ, కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాల మేర‌కు త‌గిన ఆహారం, మందులు, ఇత‌ర ప్రాథ‌మిక స‌దుపాయాల్ని క‌ల్పించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.