ఆక‌లి అడ్డుకట్టకు వాట్సాప్ 9490617523

ఆక‌లిరాజ్యం అడ్డుకట్టకు వాట్సాప్ 9490617523 నంబర్‌తో పోలీసులు వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసారు. సాపాడు ఎటూ లేదు పాటైన పాడు బ్ర‌ద‌ర్‌..అంటూ ఆక‌లిరాజ్యం సినిమాలో ఒక పాట ఉంది. అయితే ప్ర‌స్తుతం ఆ సాపాడు ల‌భించ‌క‌పోవ‌డంతో అన్న‌మో రామ‌చంద్రా..? అంటూ ప‌స్తులుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే క‌రోనావైర‌స్ మ‌హామ్మారి విజృంభ‌ణ‌తో దేశంలో ఆక‌లికేక‌లు ష‌రా మామూలు అయి పోయాయి. జ‌న‌తా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్‌, నిత్యం క‌ర్ఫ్యూ సీన్లు ఉండ‌టంతో పూర్తిగా బంద్ పాటించాల్సి వ‌స్తుంది. ఈ కారణంగానే ఆకలితో అలమటిస్తున్న పేదలు, వలసకూలీలు, యాచకులకు ఆహారం దొర‌క్క అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

దాత‌లకు వార‌ధిగా పోలీసులు
ఆహారం పంపిణీ చేసేందుకు దాత‌లు ముందుకొస్తున్నారు. కానీ, ఇక్క‌డ‌నే అసలు స‌మ‌స్య వ‌చ్చిప‌డుతుంది. అదేమిటంటే వారికి ఆహారాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి.. అన్నార్తులు ఎక్కడ ఉంటారు? అనే సమాచారం తెలుసుకోవడం కష్టమవుతున్నది. అలాంటివారిని కలిపేందుకు పోలీసులు వారధిగా మారారు. ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని అత్యవసర, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇతరాల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు డీజీపీ కార్యాలయంలో ఇప్పటికే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ ద్వారా 9490617523 నంబర్‌తో పోలీసులు వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు.

వాట్సాప్ గ్రూపులో వివ‌రాలు:
వాట్సాప్ గ్రూపులో అన్నార్తుల కోసం ఆహారపదార్థాలు, భోజనం సమకూరుస్తున్న ఎన్జీవోలు, వలంటీర్లతోపాటు, ఆహారం అవసరమైనవారి వివరాలు తెలియజేసే సంస్థలు, వలస కార్మికుల సమాచారం ఇచ్చేవారిని జతచేస్తున్నారు. ఎవరికైనా ఎక్కడైనా ఆహా రం అవసరం ఉంటే ఆ వివరాలను పైన తెలిపిన వాట్సాప్‌ నంబర్‌కు పంపవచ్చు. ఆ ప్రాంతంలోని దాతలెవరైనా స్పందించి వారికి ఆహారం పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం పోలీసులు మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు, పలు ఎన్జీవోలతో కో-ఆర్డినేట్‌ చేస్తున్నారు.ఈ చ‌ర్య‌తో ఆకలికోసం అలమటించే సామాన్యులకు సకాలంలో భోజనం అందించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.