ఆక్సిజన్ దిగుమతులపై సాధారణ కస్టమ్స్ సుంకం మినహాయింపు

ఆక్సిజన్ దిగుమతులపై సాధారణ కస్టమ్స్ సుంకం మినహాయింపు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిత్యం లక్షల్లో వస్తుండడం, కరోనా రోగులకు ఆక్సిజన్ లభ్యత అడుగంటడం వంటి పరిణామాలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో వెల్లడించారు.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆక్సిజన్ పైనా, ఆక్సిజన్ వ్యవస్థలపైనా 3 నెలల వరకు సాధారణ కస్టమ్స్ సుంకం, హెల్త్ సెస్ లకు పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఏ తరహా ఆక్సిజన్ కు, సంబంధిత పరికరాలకు ఈ మినహాయింపు వస్తుందో అనురాగ్ ఠాకూర్ ఓ జాబితాను కూడా పంచుకున్నారు.