గోవాలో కరోనా కేసులు “0”

భార‌త దేశంలో అతి త‌క్కువ వైశాల్యం క‌ల్గిన రాష్ట్ర‌మైన గోవాలో కోవిడ్-19 రోగులంతా కోలుకున్నారని, తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం మీడియాకి వివ‌రించారు. ఏడుగురికి ఈ నెల 3న కోవిడ్-19 పాజిటివ్ నిర్థరణ అయిందని, వెంటనే వారందరికీ చికిత్స అందజేశామని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ ఏడుగురికి కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న ఈ ఏడుగురిని ఆసుపత్రి నుంచి తమ ఇళ్లకు పంపించినట్లు తెలిపారు. గోవాలో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థరణ అయినవారంతా కోలుకోవడం తమకు గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసులు సున్నా అని తెలిపారు. సున్నాకు నిజంగా చాలా విలువ ఉందన్నారు. కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న తమ రాష్ట్ర వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, నర్సులు తదితరులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

వీరంతా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు లేకపోయినప్పటికీ, దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం ప్రాధాన్యం గురించి తమకు తెలుసునని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను పాటించవలసిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్ ని పూర్తిగా పాటిస్తామ‌ని, క‌రోనాని నియంత్ర‌ణ‌కి అదొక్క‌టే తార‌క‌మంత్ర‌మ‌ని ఆయ‌న చెప్పారు.