తప్పుడు సమాచారం తాట తీస్తాం.. GoM

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన నిర్మాణ్‌ భవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం (GoM) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఉపసంఘంలో సభ్యులైన పలువురు కేంద్ర మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ, నిర్వహణపై ఉపసంఘం లోతుగా చర్చించింది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను, సామాజిక దూరం నిబంధన అనుసరణపై ప్రస్తుత స్థితిని, కేంద్ర-రాష్ట్రాలు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలుసహా అనేక అంశాలను పూర్తిస్థాయిలో సమీక్షించింది. దేశవ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల సదుపాయాలతోపాటు కిట్ల లభ్యత, తీవ్ర ముప్పున్న ప్రాంతాలు తదితరాలను కూడా సమీక్షించింది. కాగా, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి తదితరాల సరఫరా కోసం దేశీయ తయారీదారులను గుర్తించి ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు ఉపసంఘానికి వివరించారు. మరోవైపు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన అమలును కూడా ఉపసంఘం సమీక్షించింది. కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా ఏర్పాటైన సాధికార బృందాల పనితీరును ఉపసంఘం ప్రశంసించింది. ప్రపంచ మహమ్మారినుంచి మనను రక్షించేందుకు నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఇతర ముందువరుస పోరాట యోధులతో దురుసు ప్రవర్తన తగదని ఉపసంఘం చైర్‌పర్సన్‌ డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా హితవు పలికారు. కోవిడ్‌-19పై అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని, వాస్తవాల కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ వెబ్‌సైట్‌సహా ఇతర అధికార వెబ్‌సైట్లను చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.