వాట్స‌ప్-యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌

వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోడానికి వాట్స‌ప్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 180 దేశాల్లో వాట్స‌ప్ వ్యవస్థకు 1.5 బిలియ‌న్ యూజ‌ర్లు ఉండ‌గా, మ‌న దేశంలో 400 మిలియ‌న్‌ల యూజ‌ర్లు ఉన్నారు. దీంతో మారుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానం, అవ‌స‌రాల మేర‌కు కొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌తో మెరుగైన సేవ‌లు అందించ‌డానికి వాట్స‌ప్ టీం రెడీ అవుతోంది.

కొత్త ఫీచ‌ర్ల‌లో ముఖ్యంగా ఇక నుంచి మొబైల్ లేకుండా వాట్స‌ప్ వెబ్ సేవ‌లు అందించ‌డానికి మార్పులు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్‌లో వాట్స‌ప్ క‌నెక్ట్ చేయాలంటే మొబైల్ నెట్ ఆన్ చేసి సిస్టమ్ లేదా లాప్‌టాప్‌లో వాట్స‌ప్ వెబ్ క్లిక్ చేసి స్కానం చేయాల్సి ఉంటుంది. ఇక ముందు ఈ విధానం ఉండ‌దు.

యూనివర్సల్‌ విండోస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వాట్సాప్‌ వెబ్ పని చేసేలా మార్పులు చేస్తున్నారు. దీంతో మ‌న‌ మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ అయినా వాట్సాప్ వాడుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాక‌ప్ విష‌యానికి వ‌స్తే వాట్స‌ప్ బ్యాక‌ప్‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది వాట్స‌ప్‌. చాట్ హిస్ట‌రీ, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇత‌ర స‌మాచారం ప్ర‌స్తుతం గూగుల్ డ్రైవ్‌లో బ్యాక‌ప్‌లో స్టోర్ అవుతోంది.

అయితే ఈ బ్యాక‌ప్ కూడా 25 జీబీల వ‌ర‌కు ప‌రిమితంగా ఉంటుంది. మ‌రోవైపు గూగుల్ డ్రైవ్‌లో మ‌న బ్యాక‌ప్‌కు ఎలాంటి ర‌క్ష‌ణ కూడా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్ బ్యాక‌ప్‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే బ్యాక‌ప్ డాటాను తిరిగి పొందాల‌నుకుంటే పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేయ‌డం అనివార్యం. వినియోగ‌దారుడు క్రియేట్ చేసుకునే పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేసి బ్యాక‌ప్ డేటాను పొంద‌వ‌చ్చు.
మ‌రో ఫీచ‌ర్‌లో ఒక వాట్స‌ప్ అకౌంట్ ఫోన్ నెంబ‌రుతో రెండు ఫోన్ల‌లో వాట్స‌ప్ సేవ‌ల‌ను వినియోగించుకునేలా ఆప్ష‌న్‌ను రూపొందిస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో ఒక మొబైల్ నెంబ‌ర్‌తో వాట్స‌ప్ క్రియేట్ చేసుకుని రెండు ఫోన్ల‌లో వాట్స‌ప్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

ఇక వాట్స‌ప్ సెర్చ్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. ఒక్కోక్క‌రికి లెక్కకు మించి వాట్స‌ప్ గ్రూప్‌లు ఉండ‌డం, వేల సంఖ్య‌లో కాంటాక్ట్ నెంబ‌ర్లు ఉండ‌డం వ‌ల్ల ఫోటోలు, వీడియోలు, లేదా యూట్యూబ్ లింకులు ఇత‌ర‌త్రా వెత‌క‌డం ఇప్పుడున్న సదుపాయంలో చాలా క‌ష్టంగా మారింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి స‌ద‌రు వినియోగ‌దారుడికి వ‌చ్చిన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇత‌ర‌త్రా వాటిని ఒకే చోట ఫైల్ మేనేజ‌ర్‌లో చూపించ‌నుంది. ఆ ఫైల్ మేనేజ‌ర్‌లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌వి సెర్చ్ ద్వారా వెతుక్కోవ‌చ్చు.

మ‌రో కొత్త ఫీచ‌ర్ ఆటోమెటిక్ మెసేజ్ డిలీట్‌ను రూపొందిస్తోంది వాట్స‌ప్ టీం. ఫేస్‌బుక్‌లో ఉన్న విధంగా త్వ‌ర‌లో వాట్స‌ప్‌లో సీక్రెట్ క‌న్జ‌ర్వేష‌న్ ఫీచ‌ర్ రాబోతోంది. ఈ ఫీచ‌ర్లో మ‌నం ఎవ‌రికైనా పంపిన మెసేజ్‌.. వారు చ‌దివాక ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంద‌న్న‌మాట‌. అయితే ఆ మెసేజ్ అవ‌త‌లివ్య‌క్తి చూసుకున్న త‌రువాత ఎంత‌సేప‌టిలో డిలీట్ అవ్వాల‌నేది మ‌న‌మే ఆప్ష‌న్‌లో పెట్టుకోవాలి.

గ్రూప్ వీడియో కాల్ చేసుకునే వారి కోసం కూడా స‌రికొత్త‌ ఫీచ‌ర్ తీసుకువ‌స్తోంది వాట్స‌ప్‌. వీడియో గ్రూప్‌ కాల్స్ పరిమితిని పెంచ‌బోతోంది వాట్స‌ప్‌. ప్ర‌స్తుతం ఉన్న ఫీచ‌ర్ మేర‌కు న‌లుగురు మాత్ర‌మే గ్రూప్ వీడియో కాల్ చేసి మాట్లాడుకోవ‌చ్చు. అయితే రానున్న రోజుల్లో 8 మంది గ్రూప్ వీడియో కాల్ చేసి స‌మావేశం అయ్యే విధంగా ఫీచ‌ర్‌ను వాట్స‌ప్‌ రూపొందిస్తోంది.

వాట్సాప్ ఇక‌ బ్రౌజర్‌లా ప‌నిచేసేలా ఫీచ‌ర్ రాబోతోంది. వాట్స‌ప్‌లో న్యూస్‌చాన‌ళ్లు, వెబ్‌సైట్ల లింకులు వ‌స్తుంటాయి. ఆ లింక్‌ల‌ను క్లిక్ చేయ‌డం ద్వారా లింక్ ఓపెన్ అవుతూనే వేరే బ్రౌజ‌ర్‌లోకి వెళుతంది. ఇక ఈ విధానానికి స్వ‌స్తిప‌లుక‌బోతోంది వాట్స‌ప్‌. త్వరలో లింక్‌ క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లోనే ఆ వెబ్‌ పేజీ ఓపెన్ అయ్యేలా ఇన్‌ యాప్‌ బ్రౌజింగ్‌ ఆప్షన్‌ను తీసుకు రాబోతోంది. దీని వల్ల భద్రత లేని వెబ్‌సైట్లు, వెబ్‌పేజీలకు చెక్‌పెట్ట‌వ‌చ్చ‌ని వాట్స‌ప్ భావిస్తోంది.

స‌రికొత్త ఆప్ష‌న్లు, పీచ‌ర్ల‌లో భాగంగా న‌కిలీవార్త‌ల‌ను అరిక‌ట్ట‌డానికి వాట్స‌ప్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో తప్పుడు వార్త‌లు, ఫోటోలు పెట్టే ఫేకూ గాళ్ల‌కు చెక్‌పెట్ట‌బోతోంది. న‌కిలీ వార్త‌ల బెడ‌ద‌ను అరిక‌ట్ట‌డానికి సెర్చ్ ఇమేజ్ ఆప్ష‌న్‌ను రూపొందిస్తోంది. మ‌న‌కు వ‌చ్చే ఫోటో ఎక్కువ సార్లు ఫార్వ‌ర్డ్ అయి ఉంటే వాట్స‌ప్ చివ‌ర సెర్చ్ ఐకాన్ వ‌స్తుంది. ఆ ఐకాన్ పై క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి ఆ ఫోటోను క్రాస్ చెక్ చేస్తుంది. త‌ద్వారా అది న‌కిలీ ఫోటోనా కాదా అనేది తేలిపోనుంది. ఇలాంటి స‌రికొత్త ఫీచ‌ర్లు, ఆప్ష‌న్లు ఎప్పుడు వస్తాయా అంటూ వాట్స‌ప్ యూజ‌ర్లు అతృతతో ఎదురుచూస్తున్నారు.