ఎగుమతులు-దిగుమతులు/వ్యవసాయం-జాగ్రత్తలు

కోవిడ్ -19 సంక్షోభం అనంతరం ఎగుమతుల పెరుగుదలకు దోహదం చేసే విధంగా వ్యవసాయ రంగం పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్చలు.

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ఆదేశాల మేరకు కేంద్ర వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి దారులు/ ఎగుమతి దారుల సమస్యల పరిష్కారానికి సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరిపారు.

కోవిడ్ -19 మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ మరియు అనుబంధ పరిశ్రమల ఎగుమతులు నిలిచి పోయినందువల్ల వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎగుమతిదారులతో చర్చలకు ఉపక్రమించింది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ఆదేశాల మేరకు కేంద్ర వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని ఉత్పత్తిదారులు/ ఎగుమతిదారుల సమస్యలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సంక్షోభం నుంచి బయటపడి ఎగుమతులను పునరుద్ధరించి, పరిశ్రమ పునరుజ్జీవనానికి దోహదం చేసే అర్ధవంతమైన చర్యలకు మార్గాన్వేషణ చేసి ఉపక్రమించడమే ఈ వీడియో కాన్ఫరెన్సు ఉద్దేశం. కోవిడ్-19 సంక్షోభాన్ని తట్టుకుని నిలిచే విధంగా వారి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశంలో ఎగుమతిదారులు, పళ్ళు, కూరగాయలు, బాస్మతి మరియు ఇతర రకాల బియ్యం, విత్తనాలు, పూలు, మొక్కలు తదితర వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ ఉత్పత్తులు, వ్యవసాయ మనిముట్లు మరియు యంత్రాల ఉత్పత్తిదారులు/ఎగుమతిదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులలో చాలామంది ఒకే విధమైన సమస్యలను, కొందరు తమ రంగానికి సంబందించిన సమస్యలను లేవనెత్తారు. ప్రధానంగా వ్యవసాయ సరుకుల ఎగుమతిదారులు నొక్కిచేప్పిన ముఖ్య విషయం కూలీల లభ్యత, వారిని తీసుకెళ్ళడానికి వాహన సౌకర్యం, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో అవరోధాలు, మండీల మూసివేత వల్ల ముడిసరుకుల కొరత, వృక్ష ఆరోగ్య సర్టిఫికెట్ల జారీ, కొరియర్ సర్వీసుల మూసివేత వల్ల రవాణా పత్రాలు పంపడంలో అవరోధాలు, రవాణా సేవలు లేకపోవడం, ఎగుమతులు/దిగుమతులు జరిపేందుకు ఓడరేవులకు వెళ్లి సరుకులు ఎత్తించలేకపోవడం వంటి సమస్యల గురించి వారు ప్రస్తావించారు. .

ఫుడ్ ప్రాసెసింగ్, మసాలా దినుసులు, కాజు మరియు యంత్రాలు & వ్యవసాయ పనిముట్ల రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు కనీసం 25-30% ఉద్యోగులతో పనులు నిర్వహించి లావాదేవీలు జరిపేందుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వ సూచన మేరకు సరైన రీతిలో ఆరోగ్య నియమాలు పాటిస్తామని వారు తెలిపారు.

అంతర్గత రవాణా సమస్యను గురించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీచేసింది. అంతేకాక వృక్షాల ఆరోగ్యం గురించి నిరంతరం / క్రమం తప్పకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని మరియు ఆన్ లైన్ సర్టిఫికెట్లను అంగీకరించాలని కూడా ఆదేశాలు జారీచేశారు.

రేవులు, సముద్ర రవాణా సేవలకు, కొరియర్ సర్వీసులకు సంబందించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శ్రీ అగర్వాల్ తెలిపారు. తమ విభాగాలను తెరిచేందుకు అనుమతించాలన్న పరిశ్రమ అభ్యర్ధన గురించి ప్రస్తావిస్తూ ఆయా రంగానికి సంబంధించిన సమస్యలను మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ తో సంప్రదించి పరిష్కారానికి సరైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

వ్యవసాయ & అనుబంధ ఉత్పత్తుల ఎగుమతిలో ఇండియా ముందున్నది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా రూ. 2.73 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ & అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. విదేశీ వర్తకం ద్వారా వ్యవసాయ రంగం లాభాలు గడిస్తున్నది. వ్యవసాయ రంగం ఎగుమతుల ద్వారా దేశం విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది. విస్తృతమైన అంతర్జాతీయ మార్కెట్టుకు వ్యవసాయ ఎగుమతులు చేయడం వల్ల రైతులు /ఉత్పత్తిదారులు/ఎగుమతిదారులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఎగుమతుల పెరుగుదల వల్ల వ్యవసాయ రంగంలో సాగుచేసే విస్తీర్ణం మరియు ఉత్పాదకత పెరిగాయి.