ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఢిల్లీ సర్కార్‌ ఆదేశాలు

ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఢిల్లీ సర్కార్‌ ఆదేశాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్‌.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది.100 పడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు.. 30 శాతం సాధారణ, ఐసీయూ పడకల్ని ప్రత్యేకంగా కొవిడ్‌ బాధితుల కోసం రిజర్వ్‌ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. 100కు పైగా పడకలు ఉన్న ఆసుపత్రులు ఢిల్లీలో 54 ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు రిజర్వ్‌ అయి ఉన్న 1,844 సాధారణ పడకలు తాజా ప్రభుత్వ ఆదేశాలతో 4,422కు, 638 ఐసీయూ పడకలు 1,357కు పెరగనున్నాయి.అలాగే ఆసుపత్రులలో చేరుతున్న వారి వివరాలు.. ఆసుపత్రి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో కరోనా కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం ఏకంగా 4000 కేసులు నిర్ధారణ అయ్యాయి.