ఎగుమతుల్లో 5% తగ్గిన జీఎస్పీ లబ్ది

ఎగుమతుల్లో 5% తగ్గిన జీఎస్పీ లబ్ది
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

భారత్‌కు అమెరికా వాణిజ్య రాయితీలను రద్దు చేసిన కారణంగా ఆ దేశానికి ఎగుమతుల ద్వారా పొందే లబ్ది 5 శాతానికి తగ్గినట్లు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పియూష్‌ గోయల్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ (జీఎస్‌పీ) ప్రోగ్రాం కింద అభివృద్ధి చెందే దేశాలకు కల్పించే వాణిజ్య రాయితీలను భారత్‌కు ఎన్నో ఏళ్ళుగా కొనసాగిస్తున్న అమెరికా గత ఏడాది వాటిని ఉపసంహరించుకుంది. జీఎస్పీ జాబితాలో ఉన్న దేశాల నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించదు. ఫలితంగా ఎగుమతుల ద్వారా భారతదేశం సగటున 11 శాతం పొందే జీఎస్పీ లబ్ది 2019 జనవరి- మే 5 శాతం మాత్రమే ఉన్నట్లు మంత్రి వివరించారు. భారత్ నుంచి అయ్యే ఎగుమతులపై 2015లో జీఎస్పీ లబ్ది 11 శాతం, 2016లో 11 శాతం, 2017లో 13 శాతం, 2018లో 12 శాతం ఉండగా 2019 జనవరి-మే కాలానికి 5 శాతం మాత్రమే జీఎస్పీ లబ్ది లభించింది. గడచిన నాలుగేళ్ళలో జరిగిన ఎగుమతుల విలువతో పోలిస్తే 2019 జనవరి-మే మధ్య కాలంలో ఎగుమతుల విలువ పెరిగినప్పటికీ జీఎస్పీ లబ్ది తగ్గినట్లుగా ఆయన గణాంకాల సహాయంతో వివరించారు. జీఎస్పీ జాబితా నుంచి తొలగించిన పిమ్మట గత ఏడాది జూన్‌ – డిసెంబర్‌ మధ్య కాలంలో అమెరికాకు జరిపిన ఎగుమతులలో 5 శాతం పెరుగుదల నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.