ధరలు నిర్ణయించిన గుంటూరు శ్మశాన వాటిక

ధరలు నిర్ణయించిన గుంటూరు శ్మశాన వాటిక

ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా గుంటూరులోని శ్మశాన వాటికలు ధరలు నిర్ణయించేశాయి. కరోనాతో మరణించిన వారికి ఒక రేటు, సహజ మరణానికి ఒక ధరను ఫిక్స్ చేశాయి. ఈ మేరకు శ్మశానం గోడలపై అందరికి తెలిసేలా తాటికాయంత అక్షరాలతో ధరలు రాసుకొచ్చారు. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయాలంటే రూ. 5,100, సహజ మరణానికైతే రూ. 2,200 చెల్లించాలంటూ పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడలపై రాశారు. గతంలో సాధారణ మరణానికి గరిష్ఠంగా రూ.1200 వసూలు చేసేవారు. ఇప్పుడు దానికి అదనంగా రూ. 1000 పెంచారు. నగరంలోని ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోలా వసూలు చేస్తున్నారని, అందుకనే శ్మశాన వాటికల పాలకవర్గాలతో చర్చించి ఉన్నతాధికారులు ఈ ధరలు నిర్ణయించినట్టు నగర పాలక కొవిడ్ మరణాల పర్యవేక్షణాధికారి, డిప్యూటీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య తెలిపారు.అయితే, ఈ విషయంలో నగర పాలక సంస్థకు సంబంధం లేదని కమిషనర్ అనురాధ చెప్పడం గమనార్హం. ఆయా శ్మశాన వాటికల కమిటీల ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం అంత్యక్రియల ఖర్చులను బోర్డులపై ఏర్పాటు చేయాలని ఆదేశించామని, అయితే పాత గుంటూరు శ్మశాన వాటిక వద్ద బోర్డును తప్పుగా రాయించారని అన్నారు.అనాథ శవాల అంత్యక్రియల బాధ్యత నగరపాలక సంస్థదేనని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు. కొవిడ్ మృతుల దహన సంస్కారాలను అవసరమైతే ఉచితంగా చేయాలని ప్రభుత్వం చెబుతుంటే ఇలా ధరలు నిర్ణయించడంపై నగర వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.