హోలీ హోలీరే రంగుల కేళి ప్రత్యేకత

హోలీ హోలీరే రంగుల కేళి ప్రత్యేకత

శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది ఫాల్గుణ మాసం ఎందుకంటే శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించినది ఈ మాసంలోనే.
అందుకే శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించడానికి ఈ మాసం
చాలా పవిత్రమైనది. ఇంతటి విశిష్టతను కలిగిన
ఈ మాసంలోనే ‘హోలీ’ పండుగ వస్తుంది.

హొలీ పండుగ రెండు రోజులపాటు జరుపుకుంటారు. ప్రజలందరి మధ్యలో సఖ్యత, సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా వీధులన్నీ రంగుల మాయంతో నిండిపోతాయి. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున ‘కామదహనం’
ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికా పూర్ణిమ (కాముని పున్నమి) వేడుకలు ఉత్సాహంగా సంబరంగా జరువుకుంటారు.

లోక కల్యాణమే లక్ష్యంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించాలని దేవతలు నిర్ణయించుకుంటారు. శ్రీ పార్వతీ దేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చూడాలని దేవతలందరూ మన్మధుడిని కోరుతారు. ఎప్పటిలాగే శివుడి పైకి మన్మథుడు బాణాన్ని ప్రయోగించి, ఆయనకి తపోభంగాన్ని కలిగిస్తాడు.
దీంతో ఆగ్రహంతో శివుడు మన్మథుడిని తన మూడవ కన్నుతో భస్మం చేస్తాడు. కొరికల్ని దహింపజేసిన రోజు కావడంతో
‘కామదహనం’ ప్రసిద్ధి చెందింది. కోరికలను నియంత్రించిన వ్యక్తులే ఉత్తమైన మార్గంలో ప్రయాణించి ఉన్నతమైన
శిఖరాలను చేరుకుంటారని ఈ పండుగ పరమార్థంగా భావిస్తారు.

మన దేశంలో ఈ ఇతివృత్తంతో మన్మథుడి బొమ్మను తగులబెట్టడాన్ని సామూహిక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మరునాడు పౌర్ణమి రోజునే, హోళికా అనే రాక్షసి సంహరించబడటంతో ‘హోళికా పూర్ణిమ’ పేరు వచ్చింది.
అలాగే భస్మమైపోయిన మన్మథుడుకి శివుడు అదృశ్య రూప దర్శనమివ్వడం ప్రత్యేకతలు.

ఈ చరిత్రను పరిగణించి మనదేశంలో ప్రజలంతా ఐక్యమత్యంతో కులమతాలకు అతీతంగా సంతోషంతో
కలిసిమెలసి రంగులు చల్లుకుంటారు. ఈ రోజున ఉదయం సమయంలో శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించి, రాత్రివేళలో శ్రీ కృష్ణుడికి ‘పవళింపు సేవ’ ను నిర్వహించడం వలన సకల శుభాలు కలుగుతాయని మన పురాణాల సారాంశం. ఐతే ఓ విషయం ప్రకృతి ప్రసాదించిన రంగులతో హోలీ చేసుకుందాం కృత్రిమ రంగులకు స్వస్తి పలుకుదాం పర్యవరణాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.