“అమ్మ కడుపు చల్లనా” మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

మ..హే..ష్ మ..హే..ష్ ఆ పేరు లో ఏముందో అని విన్నాం కానీ ఎప్పుడైనా ఆలోచించామా ‘అమ్మా’అమ్మా’ ఆ పిలుపులో ఏముందో !!!

ప్రపంచాన్ని పాలించే ప్రధాన మంత్రి అయినా, రాజైన రారాజైన సరే అమ్మ మాధుర్యం ముందు దిగదుడుపే. పొత్తిళ్ళలో పసిగుడ్డుని చూసి, ఎంత ఆగర్భ శ్రీమంతురాలైనా కడు బీద అయినా సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో వున్నా ఎన్ని అణచివేతలకు లోనైనా చంద్రుడితో చిందులేసినా స్త్రీ అమ్మ ఐతే చాలు ఒక్క సారిగా తన ప్రాధాన్యతలు మారి పోతాయి.

అన్నం తింటున్నా ఏ అడుగు ముందుకు వేస్తున్నా ఏం చేస్తున్నా ముందు బిడ్డ గురించే ఆలోచిస్తుంది. తల్లిదండ్రుల గారాల పట్టిగా, యువరాణిగా పెరిగినప్పటికి తనకు బిడ్డ పుట్టగానే అసిద్దం సైతం ఆనందంగా శుద్ధి చేస్తుంది. తను ఒక ముద్ద తినే ముందు నా ముద్దుల బిడ్డే ముందు తినాలి అనుకుంటుంది. అవసరం అయితే తను పస్తులుండి మరీ బిడ్డ ఆకలి తీరుస్తుంది. కష్ట పడి ఒక్క కాసు ఎక్కువ సంపాదిస్తే చాలు కన్నబిడ్డకి ఏం కొనివ్వాలి అని ఆలోచిస్తుంది.

తన కంటి చూపు తగ్గుతున్నా బిడ్డ కోసం ముందు చూపుతో ప్రణాళిక వేస్తుంది. అంతెందుకు కాటికి కాళ్ళు చాపుతున్న వయస్సులో కూడా కన్న బిడ్డ మంచాన వుంటే విరిగి పోయిన రెక్కలు సైతం మళ్లీ ముక్కలు చేసుకుని బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తున్న తల్లులు ఎందరో. పది మంది పిల్లల్ని ఒక్క తల్లి కని పెంచి పోషిస్తే పది మంది పిల్లలకీ ఇప్పుడు తల్లి బరువైతుంది.

పేగు తెంచి ప్రాణం పోసిన తల్లికి మనం ఏం ఇవ్వాలి…బహుమతులు, సర్ప్రైజ్ సరే అసలు అమ్మకి ఏం కావాలో అడిగామా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేశామా…ఆ ప్రయత్నాలు చేద్దాం ఈరోజు అడుగుదాం అమ్మా నీకేం కావాలి నా నుండి నీకు ఏం కావాలి? అని అడిగి చూడండి ఇవ్వాళ కూడా అమ్మ చెప్పే సమాధానం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏం కావాలి అని అడగగానే అమ్మ మన లాగా లిస్ట్ ఇవ్వదు. ఒక చిన్న చిరునవ్వు కానుక ఇచ్చి నువ్వు చల్లగా వుండు నాయనా, అమ్మా ఆని దీవిస్తుంది. అమ్మ కడుపు చల్లన అంటే ఇదేనేమో.

ఈ అమృత వ్యాఖ్యలు మీకు అందించిన”ముదిగొండ రాజ చంద్రిక హైదరాబాద్”కు శుభాకాంక్షలు.