దేశాన్ని మోదీ 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్న హర్షకుమార్

దేశాన్ని మోదీ 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్న హర్షకుమార్

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పెట్రో ధరలపై ఆగ్రహావేశాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ పెట్రో ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల వరకు ఒంటెపై కూర్చుని ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్‌ను మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హర్షకుమార్ హెచ్చరించారు.