ప్రజలే నడిపిస్తోన్న పోరాటం చూసారా!

మిత్రులారా! కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం నిజంగా ప్రజలే నడిపించిన పోరాటం. భారతదేశంలో, ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్నారు. శాసన వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ప్రజలతో కలిసి పోరాడుతున్నాయి. అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న భారతదేశం పేదరికంతో నిర్ణయాత్మక పోరాటం చేస్తోంది. కరోనాతో పోరాడటానికి, గెలవడానికి దేశానికి ఏకైక మార్గమే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసస్సులో మాటలో అన్నారు.

ఈ రోజు మొత్తం దేశం – దేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు, ఈ పోరాటంలో సైనికులుగా పాల్గొనడం, పోరాటానికి నాయకత్వం వహించడం మన అదృష్టం. మీరు ఎక్కడ పరిశీలించినా భారతదేశం చేసే యుద్ధం ప్రజలే నడిపిస్తున్న యుద్ధమని గ్రహిస్తారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విషయంలో చర్చ జరిగితే, ఈ పోరాటంలో పద్ధతులపై చర్చ జరిగితే, ప్రజలే నడిపిస్తోన్న భారతదేశం చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా చర్చకు వస్తుందని నేను నమ్ముతున్నాను.

దేశవ్యాప్తంగా ప్రతిచోటా ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పేదలకు ఆహారం, రేషన్ సదుపాయం, లాక్డౌన్ వ్యవస్థలో పాటించాల్సిన విధానాలు , ఆస్పత్రులు ఏర్పాటు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసే అంశం మొదలైన అనేక విషయాల్లో ఈరోజు దేశం మొత్తం ఒకే లక్ష్యం, ఒకే దిశ వెంట కలిసిమెలిసి వెళ్తోంది. చప్పట్లు, గంటలు, దీపం, కొవ్వొత్తి ఇవన్నీ నవీన ఆలోచనలకు తావిచ్చాయి. ఈ విషయాల్లో ప్రజలు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చారు. నగరమైనా, గ్రామమైనా దేశంలో ఒక భారీ మహా యజ్ఞం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరూ సహకరించడానికి ఆసక్తిగా ఉన్నారు.

మన రైతు సోదరులు, సోదరీమణులను చూడండి. ఒక వైపు ఈ కరోనా ప్రబలుతున్నా 24/7 పగలు, రాత్రి తమ పొలాలలో కష్టపడి పనిచేస్తున్నారు. మరోవైపు ఆకలితో దేశంలో ఎవరూ నిద్రపోకూడదని కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. కొందరు అద్దె మాఫీ చేస్తుంటే, మరికొందరు తమ పెన్షన్ లేదా ఇతరత్రా వచ్చిన డబ్బును PM CARESలో జమ చేస్తున్నారు. పొలంలోని అన్ని కూరగాయలను కొందరు దానం చేస్తున్నారు. మరికొందరు ప్రతిరోజూ వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహారం ఇస్తున్నారు. కొందరు మాస్కులు తయారు చేస్తున్నారు. కొందరు కూలీ సోదరులు, సోదరీమణులు తాము నిర్బంధంలో భాగంగా బస చేస్తున్న పాఠశాలకు రంగులు వేస్తున్నారు.

మిత్రులారా! ఇతరులకు సహాయం చేయడానికి మీలో- మీ హృదయంలోని ఏ మూలలోనైనా ఉన్న ఈ భావోద్వేగమే కరోనాకు వ్యతిరేకంగా, భారతదేశం చేసే ఈ పోరాటానికి బలాన్ని ఇస్తోంది. ఈ భావనే ఈ పోరాటాన్ని ప్రజలే నడిపించేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఇది ఒక మానసిక స్థితిగా మారి బలపడుతోంది. కోట్లాది ప్రజలు గ్యాస్ సబ్సిడీని వదిలివేయడం, లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు రైల్వే సబ్సిడీని వదిలివేయడం, స్వచ్ఛ భారత్ అభియాన్ నాయకత్వాన్ని తీసుకోవడం, మరుగుదొడ్లు నిర్మించడం వంటివి – ఇలాంటి లెక్కలేనన్ని విషయాలు మన మనస్సును దృఢంగా చేస్తాయి. దేశం కోసం ఏదైనా చేయటానికి ప్రేరణగా నిలుస్తాయి.