ఇంటి పనులు ఇన్నిన్ని కాదయా!

అనుభవమైతేగానీ తత్వం బోధ పడదు. నిజానికి ఈ తత్త్వంలో త కు తావత్తు ఉండేది. తత్త్వాన్ని మనం లైట్ గా తీసుకోవడం వల్ల తా వత్తు పోయింది. అసలు తత్వమే గాలికి కొట్టుకుపోయే కాలంలో తొక్కలో తా వత్తు గురించి కళ్ళల్లో ఒత్తులేసుకుని వెతకడం చేయకూడని పని. కరోనా క్రిమికి ఒత్తులే లేవు కానీ, ప్రపంచాన్ని ఒత్తి పారేస్తోంది.

హిందీలో ‘ కరోనా’ అంటే పని ‘చెయ్యి’ అని ఆదేశాత్మక క్రియా పదం. కరోనా వైరస్ కు – హిందీ క్రియావాచకం కరోనాకు బీరకాయ పీచు సంబంధం కూడా లేదు. కానీ, స్వీయ గృహ నిర్బంధాలు, సామాజిక దూరాలు, స్వీయ నియంత్రణలు, లాక్ డౌన్ల నేపథ్యంలో ఎవరికీ పనిమనుషులు రావడం లేదు. రావాలని కోరుకోవడం లేదు. అమెరికలాంటిదేశాల్లో ఎవరిపని వారు చేసుకుంటారు. మనదేశంలో అన్నిటికీ పనిమనుషులే. ఇంటిపని, వంటపని, డ్రైవింగ్ అన్నిటికీ మనుషులు ఉండాల్సిందే. కరోనా కట్టడిలో భాగంగా ఎక్కడివారు అక్కడే ఆగిపోయేసరికి మొత్తం పని మనుషులమీద ఆధారపడ్డవారు తొలిసారి నడుము వంచుతున్నారు. తమ నడుము ఇంతగా వంగుతుందా అని వారికి వారే ఆశ్చర్యపోతున్నారు. చీపురు చేత పడుతున్నారు. అంట్లు తోముతున్నారు. వండుతున్నారు. బట్టలు ఉతుకుతున్నారు. రోజూ పనిమనిషి కష్టం ఎంత ఉందో తెలుసుకుంటున్నారు.

చాలా చిన్న ఇంట్లో ఉండలేకపోతున్నాం. పెద్ద ఇంట్లోకి వెళ్లాలని కలలు కంటున్నవారు- ఇలాంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద ఇల్లయితే అంత కష్టమని తాత్కాలికంగా అనుకుంటున్నారు.

స్విగ్గీ తరం పిల్లలు చాలా రోజులుగా బయటి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా బర్గర్లు తినక విలవిలలాడుతున్నారు. ఇన్నేళ్లల్లో తొలిసారి పిల్లలు ఇంటివంట తింటున్నందుకు తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు. స్విగ్గీ డెలివరీలు మొదలయిన వెంటనే ఏమేమి ఐటమ్స్ తెప్పించుకుంటారో ముందే పిల్లలు తల్లులచేత ఒట్టేయించుకుంటున్నారు.

ఇంట్లో ఒకరు లేక ఇద్దరు పిల్లల బాగోగులు చూడడానికే ఇన్ని ఆపసోపాలు పడుతున్నాం- ఆ రోజుల్లో మేము పది మంది పిల్లలం- మా అమ్మా నాన్న ఎలా పెంచారో? అని ఆనాటి వారి పెంపకాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇలాంటి ఉపద్రవాలు, లాక్ డౌన్లు పొరపాటున కూడా ప్రపంచానికి మళ్లీ రాకూడదు. కానీ, ఇందులో నుండి ప్రపంచం నేర్చుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది ఎంతో ఉంది.

నాలుగురోజులు పని మనుషులు రాకపోతే మన పనులు మనం ఎలా చేసుకోవాలో నేర్చుకోవచ్చు. జిమ్ములకు వెళ్లి అద్దాల గదుల్లో చెమట చిందించడం కంటే, ఇంటి పని ఎంతో కొంత చేస్తూ శరీరానికి వ్యాయామ సుఖం అందించవచ్చు. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది?
ఇద్దరంఒక్కటై చేయి కలిపితే ఎదురేమున్నది?
మనకు కొదవేమున్నది? అని శ్రమ విభజన చేసుకుని పరవశించినా, పరవశించకపోయినా పనులు చేసుకోవచ్చు. ఎప్పుడూ కుంభాలకు కుంభాలు వండిపెట్టి అలసిపోయిన భార్యకు- లాక్ డౌన్ కానుకగా భర్త తనకు వచ్చినట్లుగా వండి పెట్టవచ్చు. లేదా వంటపనిలో సాయం చేయవచ్చు. అదికూడా చేతకాకపోతే అంతా అయ్యాక అంట్లు తోమి పెట్టవచ్చు. ఆమాత్రం సాయం చేయకపోతే పాడు కరోనాకంటే మీ గృహ నిర్బంధాన్ని గృహిణులు ఎక్కువగా తిట్టుకునే ప్రమాదం ఉంది.

కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు సుమతీ! అని శతకం స్పష్టంగా చెప్పింది. ఇంట్లో ఇల్లాలు బాధపడితే మీ ఇంట్లో లక్ష్మి దేవి ఉండమన్నా ఉండదట. మీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే ఈ లాక్ డౌన్లో అయినా మీ గృహలక్ష్మిని ప్రసన్నం చేసుకోండి. అప్పుడు కరోనా తగ్గగానే మీకు డబ్బులే డబ్బులు- లేకపోతే దెబ్బలే దెబ్బలు! -పమిడికాల్వ మధుసూదన్