హ్యాచ్ బ్యాక్ వెర్షన్ తీసుకువచ్చిన హోండా

జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ మోడల్ తీసుకువచ్చింది. గతంలో ఉన్న సిటీ మోడల్ ను హ్యాచ్ బ్యాక్ వెర్షన్ గా అప్ డేట్ చేసి నయా కారును మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయితే ఇది పరిమిత మార్కెట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఆసియాలో థాయ్ లాండ్, ఇండోనేసియాలో లాంచ్ చేశారు.ఈ ఫిఫ్త్ జనరేషన్ సెడాన్ ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మూడు వేరియంట్లలో వస్తున్న హోండా సిటీ హ్యాచ్ బ్యాక్ కారులో 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. భారత కరెన్సీలో ఈ వాహనం ధర రూ.14.59 లక్షల నుంచి రూ.18.25 లక్షల వరకు ఉండనుంది. స్పోర్టీ లుక్ ఉట్టిపడుతున్న హోండా సిటీ హ్యాచ్ బ్యాక్ లో 8 అంగుళాల తెరతో ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ పొందుపరిచారు. హోండా కనెక్ట్ టెలిమాటిక్స్, సింగిల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ సౌకర్యాలు ఉన్నాయి. పూర్తిగా లెదర్ సీటింగ్ తో రిచ్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ఇందులో భద్రతకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారు. సిటీ హ్యాచ్ బ్యాక్ స్టాండర్డ్ మోడల్ లో 4 ఎయిర్ బ్యాగులు, ఆర్ఎస్ ట్రిమ్ మోడల్ లో 6 ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేశారు. వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లతో హోండా సిటీ ఆల్ న్యూ హ్యాచ్ బ్యాక్ కార్ల ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే ఈ కారు భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేదు.