కరోనాలో లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయ్? జనులారా జాగ్రత్త

కరోనావైరస్ పుణ్యమా అని మెజార్టీ ప్రపంచం ఎన్నడూ లేని రీతిలో లాక్ డౌన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్పట్లో అంతకు మించిన అస్త్రం ఇంకొకటి లేదని అన్ని దేశాలు భావించినప్పటికీ… రోజు రోజుకీ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో.. వైరస్‌తో కలిసి జీవించడం తప్ప.. మరో దారి లేదన్న పరిస్థితికి దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు వచ్చేశాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే చాలా దేశాల్లో లాక్ డౌన్ సడలింపులు మొదలు పెట్టేశాయి కూడా. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కల్గిన రెండో దేశమైన భారత్ కూడా మినహాయింపేం కాదు.

ఓ వైపు కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నప్పటికీ… ఇప్పుడు ఇక ఎంత మాత్రం లాక్ డౌన్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. మూడో విడత కొనసాగిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన మర్నాడే.. భారీ ఎత్తున సడలింపుల్ని ప్రకటించింది. జోన్ల పేరిట ప్రాంతాలను విభజించి అందుకు అనుగుణంగా అనేక రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో దేశంలోని ఐదారు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరినప్పటికీ ఆ తరువాత ఆయా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల్ని తమ పరిస్థితులకు అనుగుణంగా నెమ్మది నెమ్మదిగా అమలు చేస్తూ వచ్చాయి.

మొత్తంగా ఏ రాష్ట్రం, ఏ దేశం ఎంతో కాలం ఆర్థిక కార్యకలాపాల్ని నిలిపేసి కాళ్లు ముడుకొని కూర్చోవడం సాధ్యం కాదు. కనుక.. ఇప్పుడు లాక్ డౌన్‌ను క్రమంగా ఎత్తేయడం తప్ప ఏ ప్రభుత్వానికి మరో మార్గం లేదు. అంటే ఇప్పటి వరకు వైరస్ మనల్ని కాటేయకుండా తమ బాధ్యతగా ప్రభుత్వాలు రక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పదే పదే విజ్ఞప్తి చేశాయి. పోలీసుల్ని కాపలా పెట్టాయి. వినకపోతే శిక్షించాయి కూడా. అయినా సరే కొంత మంది వినడానికి మిగిలిన కొంత మంది అలవాటు పడటానికి కొద్ది రోజులు పట్టింది. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే… ఈ విషయంలో ప్రభుత్వాలు చెయ్యాల్సింది చేశాయి. కానీ ఇక అలాగే చేస్తూ వెళ్లడం వాటి వల్ల కాదు. కనుక ఇప్పుడు మనల్ని ఇక మనమే రక్షించుకోవాలి.

ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా… లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా అని ఈ దేశంలో మెజార్టీ జనం కూడా ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఎందుకంటే వారిలో ఎక్కువ మంది రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులే. వలస కూలీల పాట్లు ఎలా ఉంటాయో గడిచిన ఐదారు వారాలుగా యావత్ దేశం గమనిస్తూనే ఉంది. చివరకు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు కాలినడకనే బయల్దేరి మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలను కూడా మనం చూశాం. కనుక వారి జీవితాలు మళ్లీ గాడిన పడాలంటే మునుపటి పరిస్థితి రావాల్సిదే తప్ప మరో దారి లేదు.

లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయ్?

మొత్తంగా లాక్ డౌన్ ఇక ఎంత మాత్రం కొనసాగక పోవచ్చన్న విషయం బహుశా మరి కొద్ది సేపట్లో ప్రధానితో జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చు కూడా. అంటే కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పినట్టు మనం కరోనాతో ఇక జీవించి తీరాల్సిందే. అంతకు మించి మరో మార్గం లేదు.

మనం ఏం చేయాలి?

కొద్ది రోజుల క్రితం మన్ ‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాస్కులు ఇకపై మన జీవితంలో భాగం కావాలని తేల్చి చెప్పేశారు. అంటే కరోనావైరస్‌కు వ్యాక్సీన్ వచ్చేంత వరకు ఇల్లు దాటితే ముఖానికి ముసుగు తగిలించుకోవాల్సిందే. అలాగే శానిటైజర్లు ఇక మనకు నిత్యావసరాల కన్నా ఎక్కువ. ఎందుకంటే ఒక పూట తిండి లేకపోయినా బతక గలం కానీ శానిటైజర్ రాసుకోకుండా కనీసం కారు డోరు కూడా తియ్యలేం. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం ఇక సర్వ సాధారణమైపోతుంది. ఇక అన్నీ కళ్లతోనే పలకరింపులు… చేతులు జోడించి పలకరించడమో లేదా దూరం నుంచే ఊపుతూ పలకరించడమో తప్ప… ఇక షేక్ హ్యాండ్ ప్రసక్తే ఉండకపోవచ్చు. బస్సు ప్రయాణాల్లో దూరం, రైలు ప్రయాణాల్లో దూరం, విమాన ప్రయాణాల్లో కూడా దూరం తప్పదు. అందుకనుగుణంగా వాటి టిక్కెట్ల ధరల్లో పెరుగుదల తప్పదు.

ఆన్ లైన్ లావాదేవీలు, క్యాష్ లెష్ కబుర్లు పెరుగి తీరాల్సిందే. సినిమా హాల్లో అంతా కలిసి సినిమా చూద్దామన్న కోరిక ఇప్పట్లో తీరుతుందే లేదో చెప్పడం కష్టమే. కొద్ది రోజుల తర్వాత షాపింగ్ మాల్స్‌ ఓపెన్ అయినా.. నిన్న మొన్నటి కళ రేపు ఊహించడం కష్టం. దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వారంతపు సంతల్ని ఇప్పట్లో చూడలేం. హైదరాబాద్‌లో కోఠీ, దిల్లీలో చాందినీ చౌక్ వంటి మార్కెట్లు మునపటి కళను పూర్తిగా కోల్పోతాయి. సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు మునుపు ఉన్నట్టు ఏ మాత్రం ఉండవు. పెళ్లిళ్లలో కల్యాణమండటం వందలు, వేల మంది అతిథులతో కళ కళలాడటం ఇక ఇప్పట్లో చూడలేం. తిరుమల, షిర్డీ, పుట్టపర్తి, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దర్శనాల విధి విధానాలు కూడా మారిపోతాయి.

విద్యార్థుల విషయానికొస్తే ఈ విద్యా సంవత్సరం మొత్తం గందరగోళ పరిస్థితి తప్పదు. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో దేశ వ్యాప్తంగా మెజార్టీ పాఠశాలల్లో షిఫ్టుల విధానం తప్పకపోవచ్చు. విద్యా సంవత్సరంలో కనీసం 2 నెలల పాటు కోల్పోయే అవకాశం ఉండటంతో ఇప్పటికే పాఠ్యాంశాలను తగ్గించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే సెలవుల్ని కూడా తగ్గించనున్నాయి. విద్యావ్యవస్థలో ఆన్ లైన్ విధానం ఇకపై తప్పనిసరి అయిపోతుంది. నిన్న మొన్నటి వరకు మొబైల్ ముట్టుకోవద్దని చెప్పిన తల్లిదండ్రులే ఇకపై వారికి ల్యాప్ టాప్‌లు, ఐపాడ్‌లు తప్పనిసరిగా కొని ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి.

ఇకపై పరిశుభ్రత అన్నది దాదాపు అందరి విషయంలో ప్రథమ ప్రాధాన్యం కావచ్చు. సామాజిక దూరం అనివార్యమైన నేపథ్యంలో క్రమంగా కొన్నాళ్లకు అది కూడా అలవాటుగా మారిపోవచ్చు. అలాగని మద్యం షాపుల ముందు కూడా సామాజిక దూరం పాటించాలని మనం ఆశించడం అందుకు మినహాయింపు కావచ్చు.

ఇన్నాళ్లూ వైద్యరంగానికి కేటాయింపుల విషయంలో నిర్లక్ష్యం వహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై మరన్ని నిధుల్ని కేటాయించక తప్పని పరిస్థితి రావచ్చు. ఇప్పటికీ కనీస వైద్య సౌకర్యాలు లేని గ్రామాల్లో పరిస్థితి ఇకపైనైనా మెరుగు పడుతుందని ఆశించవచ్చు. ఇక పై ఐసోలేషన్ అన్నది మన జీవితంలో భాగం అయిపోవచ్చు. కనీసం వ్యాక్సీన్ వచ్చేంత వరకు అయినా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అందుకే దేశ వ్యాప్తంగా ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు వేగంగా జరుగుతోంది.

మనం ఇప్పటి వరకు చెప్పుకున్న మార్పులన్నీ యథాతథంగా వచ్చినప్పటికీ మున్ముందు పాజిటివ్ కేసుల సంఖ్య కచ్చితంగా పెరగనుంది. వచ్చే జూన్, జూలై మాసాల్లో భారీ సంఖ్యలో కేసులు పెరగనున్నాయని సాక్షాత్తు ఎయిమ్స్ వైద్యులే హెచ్చరిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కోవిడ్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలే తప్ప మరో మార్గం లేదు.

వ్యాధి తగ్గిన తర్వాత మళ్లీ తిరగబెడుతుందా లేదా అన్న విషయంలో అనేక మీమాంసలున్నాయి. కొందరు దాన్ని తిరగబెట్టడం కాదని అంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం అదే అంటున్నారు. సాధారణంగా ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొన్నాళ్ల వరకు మరోసారి రాదు. కానీ కోవిడ్-19 విషయంలో మాత్రం అలా జరగడం లేదనడానికి దక్షిణ కొరియాలో ఆదివారం నాడు నెల రోజుల తర్వాత ఒకే రోజు కొత్తగా ఏకంగా 34 కేసులు రావడం, వైరస్ పుట్టుకకు కేంద్ర బిందువైన వూహన్ లోనూ నెల రోజుల తర్వాత కొత్తగా మరో కేసురావడం చూస్తుంటే… మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంలో అప్పుడే ఓ అంచనాకు రావడం సరికాదు. చైనా, దక్షిణ కొరియా రెండు దేశాల్లోనూ లాక్ డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. అటు మరి కొన్నాళ్ల పాటు లాక్ డౌన్ ఆంక్షల్ని కొనసాగించని నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్లో కోవిడ్-19 మరణాలు లక్ష దాటి పోతాయని అక్కడ శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

ట్రేసింగ్ మొబైల్ అప్లికేషన్లు కావచ్చు, లేదా ఆరోగ్య సేతు కావచ్చు ఇవన్నీ మనల్ని హెచ్చరించడానికే ఉపయోగపడతాయేమో తప్ప… కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అవే తారక మంత్రాలు కావు. మొత్తం మీద ఇకపై మనం కరోనావైరస్‌తో కలిసి బతకుతూనే.. మన వరకు రాకుండా చూసుకోవాలి. గతాన్ని సింపుల్‌గా మర్చిపోయి… వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. అన్నీ అనుకూలించి వీలైనంత తొందరలో వ్యాక్సీన్ వచ్చినా అది దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి ఇంకా చాలా సమయం పట్టక తప్పదు. అంత వరకు మన అప్రమత్తతే మనకు కోవిడ్-19 నుంచి శ్రీరామ రక్ష.