GODS OWN COUNTRY ప్రకృతి సోయగాలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశంగా కేరళకు ఎంతైతే గుర్తింపు ఉందో.. ప్రకృతి బీభత్సాలకు, ప్రాణాంతక వైరస్‌లతో పోరాటం చేయడంలోనూ అంతే గుర్తింపు తెచ్చుకుంటోంది.
అక్షరాస్యతలో అగ్రభాగాన నిలిచే కేరళీయులు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆ రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. ప్ పంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తొలి కేసు మనదేశంలోని కేరళలోనే నమోదు అయ్యింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో అపారఅనుభవాన్ని గడించిన ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం సమిష్టి కృషితో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలుస్తోంది.
ప్రణాళికలే విజయానికి సూత్రాలు..
ప్రకృతి బీభత్సం, ఉత్పాతం ప్రాణాంక వైరస్ కావచ్చు.. కష్టాల కడలి నుంచి బయటకు రావడం బాగా తెలిసిన కేరళీయులకు ప్రణాళికలే విజయసూత్రాలుగా నిలుస్తున్నాయి. కేరళలో అధికార వికేంద్రీకరణ ఎక్కువగా ఉంటుంది. విద్య, వైద్యరంగానికి ఎక్కువగా నిధులు కేటాయింపు ఉంటుంది. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు సమర్థవంతమైన పాలన.. మరోవైపు ప్రతీదానికి కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు పంచుకోవడం ద్వారా వరదల బీభత్సాన్ని ఎదుర్కొన్న యంత్రాంగం కరోనా వైరస్ పై పోరుకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక అందరికీ ఆరోగ్యం కోసం అమలవుతున్న మూడంచెల విధానం కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చాలా ఉపయోగపడింది.
కరోనా వైరస్ చైన్ తుంచడంలో సక్సెస్..
కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఒకరు చైనాలోని వూహాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. కేరళలోని స్వస్థలానికి వచ్చిన వైద్య విద్యార్ధికి జనవరి 18న కరోనా పాజిటీవ్ వచ్చినట్టు నిర్ధారణ జరగడంలో అధికారులు రంగంలోకి దిగారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతటితో సరిపెట్టుకోకుండా రాష్ట్రంలోని ఐదు విమానాశ్రయాల్లో వైద్య సదుపాయలకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మరోవైపు కరోనా పాజిటీవ్ కంటాక్ట్ వివరాలను గూగుల్ మ్యాప్ సహకారంతో పట్టుకుని క్వారంటైన్‌కు తరలించారు. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా అనుమానిత కేసులను 14 రోజుల క్వారంటైన్లో పెడుతుండగా, కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్లో ఉంచింది.
ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా 14 రోజులు పూర్తైన తరువాత కూడా మరో మరో రెండు వారాలు క్వారంటైన్లో బాధితులను ఉంచుతున్నారు. కాగా, కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. కరోనా దాడి మొదలవగానే అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ.20 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడానికి కన్నా ముందే మార్చి 11న ఆ రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించారు సీఎం పి. విజయన్. కరోనా నివారణకు కేరళ తీసుకుంటున్న చర్యలకు ఐక్యరాజ్యసమితి కితాబిచ్చింది. మరోవైపు కేరళను చూసి పాఠాలు నేర్చుకోవాలని ప్రపంచదేశాలకు హితబోధ చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ.. ఇవాళ కరోనా కేసుల విషయంలో దేశంలో 11వ స్థానంలో నిలిచింది. 407 కరోనా కేసులు నమోదు కాగా, 114 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. రికార్డు స్థాయిలో 291 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ ద్వారా కేరళలో రెండు మరణాలు చోటు చేసుకోవడం అక్కడి వైద్యం తీరుకు అద్దంపడుతోంది.