కరోనా యుద్ధంలో IAF 24×7

భారత వాయు సేన విశ్వమహమ్మారి కరోనా నిరోధానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారంగా ప్రభుత్వ ఆదేశానుసారం ఏ పని చేయడానికైనా 24×7 తయారుగా ఉంది. సరైన సమయానికి అత్యవసర సేవలైన ఔషధాలు, వివిధ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు రేషన్ సరఫరా, వివిధ రాష్ట్రాలకు వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించడం మరియు ఈ పోరాటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న వివిధ ఏజెన్సీలకు సహాయాన్ని సరియైన రీతిలో అందించడానికి భారత వాయు సేన నూటికి నూరు శాతం పనిచేస్తోంది.

గత కొన్ని రోజుల్లో మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, నాగాలాండ్ మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లఢక్ ప్రాంతాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర ఔషధాలను మరియు వస్తువులను వాయు మార్గం ద్వారా చేరవేసింది.

దేశ రక్షణాభివృద్ధి సంస్థ(DRDO)లో పిపిఇ తయారీకి అవసరమైన 9000కిలోల ముడి సరుకును దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాల నుండి డిఆర్డిఓకు చేరవేసింది వాయు సేన. వీటితోపాటు డిఆర్డిఓ తయారు చేసిన N95/99 మాస్కులను కూడా ఇతర ప్రాంతాలకు చేరవేసింది. ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్తలను ఖచ్చితంగా పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తన వంతు కృషి చేస్తోంది.

దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడటానికి, అత్యవసరాలను సమర్థంగా నిర్వహించడానికి భారత వాయుసేన ఎల్లప్పుడూ తయారుగా ఉంది.