తెలుగువారు గర్వంగా చెప్పుకునే ఆంధ్రాబ్యాంక్ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆంధ్రాబ్యాంకుతో సహా ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యింది. కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్లు బ్యాంకుల విలీన ప్రక్రియకు అంతరాయం కలగలేదు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వ రంగంలోన్న బ్యాంకుల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే బ్యాంక్‌ల విలీన ప్రక్రియ అమల్లోకి వచ్చింది. దీంతో ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు ఈ రోజు నుంచి కనిపించవు.
ఈ ఆరు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులలో విలీనం అయ్యాయి.
ప్రభుత్వ రంగంలో SBI తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలుస్తోంది. ఆ తరువాత స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు ఉన్నాయి. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా SBIలో అనుబంధ బ్యాంకులను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేయగా 18కి తగ్గాయి.
ఇకపై మాత్రం 12 బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి. అయితే బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఉద్యోగులు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.