దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువ మంది రోగులకు ఆక్సిజన్ సరఫరా అవసరాన్ని తీర్చడానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నావల్ డాక్‌యార్డ్‌కు చెందిన సిబ్బంది ఆరు-మార్గాలతో కూడిన రేడియల్ హెడర్‌ను ఉపయోగించి వినూత్నమైన ‘పోర్టబుల్ మల్టీ-ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ (ఎమ్వోఎమ్)’ ను రూపొందించారు. ఈ కొత్త ఆవిష్కరణతో ఒకే ఆక్సిజన్ బాటిల్‌ను ఆరుగురు రోగులకు ఏకకాలంలో ప్రాణ వాయువు సరఫరా చేసేందుకు వీలు కలుగనుంది. పరిమిత వనరులతో పెద్ద సంఖ్యలో కోవిడ్ -19 రోగులకు క్లిష్టమైన సంరక్షణను అందించేందుకు వీలుగా దీనిని తయారు చేశారు.
ఈ వినూత్న ఆవిష్కరణను విశాఖపట్నంలో నావల్ డాక్‌యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ రియర్ శ్రీకుమార్ నాయర్ విశాఖపట్నం కలెక్టర్ వి.వినయ్ చంద్‌కు అందజేశారు. ఈస్టర్న్ నావల్ కమాండ్నకు చెందిన కమాండ్ మెడికల్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సి.ఎస్.నాయుడు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి. సుధాకర్ల సమక్షంలో ఈ అందజేత కార్యక్రమం జరిగింది. తొలి విడుతగా నావల్ డాక్‌యార్డ్ అధికారులు ఐదు సెట్లను కలెక్టర్‌కు అప్పగించారు. మిగతా 20 సెట్లను వచ్చే రెండు వారాల్లో క్రమంగా సరఫరా చేయనున్నారు.