షాక్ కు గురైన భారత అధికారులు

షాక్ కు గురైన భారత అధికారులు

పరస్పరం సహకరించుకుందామని ఇటీవలి ‘క్వాడ్’ సమావేశంలో అమెరికా కల్లబొల్లి కబుర్లు చెప్పింది. సముద్ర జలాల్లో భాగస్వామ్యంతో ముందుకు పోదామని మాటలు చెప్పింది. కానీ, ఇప్పుడు మన అనుమతి లేకుండానే మన జలాల్లోకి ప్రవేశించి ఆపరేషన్ చేసింది. పైగా తమకు ఆ హక్కుందని, ఇంతకుముందూ చేశామని.. ఇకపైనా చేస్తామని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అనుమతి లేకుండా భారత్ ఇలాంటివి చేయడానికి లేదని వ్యాఖ్యానించింది. అసలేమైందంటే..ఏప్రిల్ 7న లక్ష ద్వీప్ లోని భారత ఆర్థిక జోన్ లోని సముద్ర జలాల్లో అమెరికా నేవీ ఏడో ఫ్లీట్ (సప్తమ నౌకాదళం) .. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ (ఫొసోప్స్)ను నిర్వహించింది. మన అనుమతి తీసుకోకుండానే పని కానిచ్చేసింది. మన తీర రక్షణ దళ భద్రత విధానాలను పట్టించుకోకుండా.. భారత్ అనుమతి లేకుండా అక్రమంగా ఆపరేషన్ చేసింది. దానిపై తాజాగా ప్రకటన చేసింది. ఈ ఘటనపై భారత అధికారులు కంగుతిన్నారు. విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది.

ఇదీ అమెరికా ప్రకటన…

‘‘ఏప్రిల్ 7న యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ కు భారత ఆర్థిక జోన్ లోని లక్షద్వీప్ లో 130 నాటికల్ మైళ్ల దూరం వరకు వెళ్లింది. అందుకు భారత్ నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే భారత అనుమతి లేకుండా మేం ఆ దేశ జలాల్లో ఆపరేషన్ చేశాం. అయితే, అదే సమయంలో భారత్ మాత్రం తప్పకుండా తమ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అమెరికా నేవీ ఏడో ఫ్లీట్ ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. ఈ ఫొసోప్స్ తరచూ జరిగేవేనని, గతంలోనూ చేశామని చెప్పింది. ఇకపైనా చేస్తామని పేర్కొంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విషయం కాదని తెలిపింది.