అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8

అంతర్జాతీయ మహిళా దినోత్సవం


అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఇప్పటికే
మీ వాట్సాప్, ఫేస్‌బుక్కుల్లో మెసేజులు మార్మోగుతుంటాయి. శతాబ్దము కిందటే ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తోంది. న్యూయార్క్ సిటీలో 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. దీంతో అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని క్లారా జెట్కిన్ మహిళ భావించింది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. ఐతే 1975 సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది.

సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం.

2020 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా
*I am Generation Equality: Realizing Women’s Rights* అనే నినాదాన్ని థీమ్ గా తీసుకున్నారు.
మహిళల హక్కులు, సమానత్వానికి ప్రాధాన్యం
ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చర్యలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నది ఈ థీమ్ ముఖ్యోద్దేశం.