అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచీకరణ కారణంగా జీవనశైలి మారుతున్న నేపథ్యంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనం. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు యోగాభ్యాసం తప్పనిసరి. అందుకే ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ‘ఇంటి వద్దే యోగా, కుటుంబంతో యోగా’ నినాదాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. మీరు కూడా ఇళ్లలోనే యోగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి.

వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి కావాలి. మన భారత సంప్రదాయ విధానమైన యోగ సాధన ద్వారానే యువతకు ఇవన్నీ సమకూరుతాయి. సమాజంలో శాంతి సామరస్యాలు, సుహృద్భావపూరిత వాతావరణం కూడా యోగాభ్యాసం ద్వారానే సాధ్యమని నేను విశ్వసిస్తున్నాను.

యోగాకు మతంతో ముడిపెట్టే ప్రయత్నాలు సరికావు. పంచభూతాలకు ఎలాగైతే కులమత భేదాల్లేవో. యోగాకు కూడా ఇలాంటి భేదభావాల్లేవనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇదో జీవన విధానం, ఇదో ఆరోగ్య శాస్త్రం. ఇదో కళ. భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో అంతర్భాగమైన యోగా చైతన్యగంగను మనమంతా ఆస్వాదిద్దాం. #YogaDay