ఐపీఎల్‌ 2020 రద్దు? విదేశీ క్రికెటర్లు, అభిమానులు లేకుండా? సాధ్యమా

ఐపీఎల్‌ 2020 రద్దు? విదేశీ క్రికెటర్లు, అభిమానులు లేకుండా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020పై కరోనా మబ్బులు కమ్ముకున్నాయి. కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి 29 నుంచి టోర్నీని ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించక పోతుండటంతో ఏప్రిల్‌ 20న 2020 సీజన్‌ ప్రారంభమవకపోతే ఈ ఏడాది ఐపీఎల్‌ జరగనట్టే అంటున్నాయి ఫ్రాంచైజీలు. ఐపీఎల్‌ 13th సీజన్ నిర్వహణపై బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఓ మహమ్మారిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దౌత్య, ఉద్యోగ మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్‌ 15 వరకు ఇప్పటికే రద్దు చేసింది. విదేశీ ఆటగాళ్లంతా వాణిజ్య వీసాల విభాగంలో రావడంతో ఈ నిబంధనలతో ప్రవేశం లేదు. ఐపీఎల్‌ మాత్రమే కాదు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌, ఇతర క్రీడల మ్యాచులదీ ఇదే పరిస్థితి.
భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్‌ 20న ఐపీఎల్‌ ఆరంభమవుతుంది. ఐతే ఆ నిర్ణయం ఏప్రిల్‌ 10నే తీసుకోవాలి. ఏప్రిల్‌ 21 నుంచి మే 31 వరకు ఆరు వారాల సమయం ఉంది. ఎక్కువ రోజులు రెండు మ్యాచులు నిర్వహిస్తే 60 మ్యాచులకు ఆ సమయం సరిపోతుంది. ఏప్రిల్‌ తొలి వారానికి కరోనా వైరస్‌ కట్టడిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఫ్రాంచైజీలు ఖాళీ స్టేడియాల్లో ఆటకైనా అంగీకరిస్తున్నాయేమో కానీ విదేశీ ఆటగాళ్లు లేకుండా మాత్రం అస్సలు వద్దంటున్నాయి. ఎందుకంటే ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ స్టార్లపైనే ఆధారపడటం అలాగే కోచింగ్‌, సాంకేతిక సిబ్బందిలోనూ విదేశీయులు లేకుంటే క్రికెట్ నిర్వహణే కష్టమని భావిస్తోంది IPL.