గ్రామీణ రోడ్లు తలుక్ తలుక్ మంటాయా??

గ్రామీణ రోడ్లు తలుక్ తలుక్ మంటాయా??

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై.) పథకం ఒకటవ, రెండవ దశలను 2022 సెప్టెంబరు నెలవరకూ పొడించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి విభాగం చేసిన ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.) ఆమోదించింది. ఈ పథకంలో భాగంగా మిగిలిన రహదారుల, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా ఈ ప్రతిపాదనలకు సి.సి.ఇ.ఎ. ఆమోదం తెలిపింది. అలాగే,. దేశంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం ఉన్న ప్రాంతాలకోసం చేపట్టిన రహదారుల అనుసంధాన పథకాన్ని 2023 మార్చి వరకూ కొనసాగించాలన్న ప్రతిపాదనలను కూడా సి.సి.ఇ.ఎ. ఆమోదించింది.

మైదాన ప్రాంతాల్లో500మందికి మించిన జనావాసాలకు, ఈశాన్య, హిమాలయ ప్రాంతాల్లో 250 మందికి మించిన ఆవాసాలకు రహదారులతో అనుసంధానం కల్పించే లక్ష్యంతో పి.ఎం.జి.ఎస్.వై. తొలిదశ పథకాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఇక, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అయితే, వంద అంతకు మించిన జనాభా కలిగిన జనావాసాలకు కూడా ఈ పథకం కింద రహదారులతో అనుసంధానం కల్పించవలసి ఉంది. ఈ పథకం కింద మొత్తం 1,84,444 జనావాసాలకు రోడ్ల అనుసంధానం ఏర్పాటు చేయవలసి ఉండగా, 2,432 ఆవాసాలకు ఇంకా రహదారుల అనుసంధానం ఏర్పడలేదు. మొత్తం 6,45,627 కిలోమీటర్ల నిడివితో రోడ్లు, 7,523 వంతెనలు నిర్మించాల్సి ఉండగా, 20,950 కిలోమీటర్ల నిడివిగల రోడ్లను,..1,974 వంతెనలను ఇంకా నిర్మించాల్సి ఉంది. తాజా సి.సి.ఇ.ఎ. తెలిపిన ఆమోదంతో మిగిలిన రోడ్ల నిర్మాణం. వంతెనల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇక, పి.ఎం.జి.ఎస్.వై. 2వ దశ కింద 50,000కిలోమీటర్లమేర రహదారుల వ్యవస్థను నవీకరించాలని నిర్ణయించారు. 49,885 కిలోమీటర్ల నిడివితో రోడ్లు, 765 వంతెనలు నిర్మించేందుకు అనుమతి లభించింది. అయితే, ఇందులో 4,240 కిలోమీటర్ల నిడివిగల రోడ్ల నిర్మాణం, 254 వంతెనల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. సి.సి.ఇ.ఎ. ఆమోదంతో ఇపుడు ఈ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఏర్పడింది.

పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద అసంపూర్తిగా నిలిచిపోయినన పనుల్లో ఎక్కువ ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నాయి. కోవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు, ఎడతెరిపి లేని వర్షాలు, శీతాకాలం, అటవీపరమైన సమస్యలు ఇందుకు కారణం. అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఈ పనులన్నింటినీ పూర్తి చేయించేందుకు గడువును పెంచాలని సంబంధిత రాష్ట్రాలు కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. మిగిలిపోయిన ఈ పనులను పూర్తి చేయడానికి వీలుగా పథకం అమలు గడువును 2022 సెప్టెంబరు నెల వరకూ పొడిగించారు.

దేశంలో వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు రోడ్ల అనుసంధాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రహదారుల అనుసంధాన పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఇందుకు సంబంధించి 5,714 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 358 వంతెనల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. దీనికి తోడు1,887కిలోమీటర్ల రహదారులను, 40 వంతెనలను నిర్మించేందుకు అనుమతిస్తున్నారు. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యేందుకు వీలుగా ఈ పథకం గడువును 2023మార్చి వరకూ పొడిగిస్తున్నారు. ఈ పనులతో కమ్యూనికేషన్ సదుపాయాల మెరుగుపడతాయి. భద్రతా పరంగా కూడా ఈ పనులు పూర్తికావడం ఎంతో అవసరం.

పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద చేపట్టే జరిగే గ్రామీణ రహదారుల నిర్మాణంలో అధునాతనమైన, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఖర్చుకు తగిన ప్రయోజనాన్ని రాబట్టేందుకు, వేగంగా పనులు సాగించేందుకు వీలుగా, స్థానికంగా అందుబాటులో ఉన్న సరంజామానే నిర్మాణంలో వినియోగిస్తున్నారు. నూతనమైన, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకూ లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే 61,000కిలోమీటర్లమేర నిర్మాణం పూర్తయింది. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీ సహాయంతో 1,255కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఈ టెక్నాలజీ వినియోగంతో నిర్మాణం వ్యయం, వ్యవధి భారీస్థాయిలో తగ్గిపోయింది. అంతేకాక, ప్రకృతి వనరులను రక్షించేందుకు, వాతావరణంలో కర్భన ఉద్గారాల స్థాయిని తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది.

నిర్మాణ దశలోనే కాక, నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా రోడ్లు నాణ్యంగా ఉండేలా చూసేందుకు, పి.ఎం.జి.ఎస్.వై. పథకం మూడంచెల నాణ్యతా ప్రమాణాల యంత్రాంగాన్ని నిర్దేశించింది. ఈ యంత్రాంగం కింద రాష్ట్ర స్థాయిలో, కేంద్రప్రభుత్వ స్థాయిలో నాణ్యతపై పర్యవేక్షక యంత్రాంగాన్ని పెంచారు. అలాగే,మెరుగైన నాణ్యతా ప్రమాణాల రక్షణకోసం తనిఖీలపై కూడా మరింత ఎక్కువ శ్రద్ధను కేంద్రీకరించారు. దీనితో వివిధ రహదారి పనుల సంతృప్త స్థాయి ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది.

ఇక, పి.ఎం.జి.ఎస్.వై. 3వ దశను కూడా ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. 2025 మార్చి నాటికి 1,25,000వకిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాన్నిఈ దశలో నిర్దేశించారు. ఇందులో ఇప్పటికే, 72,000కిలోమీటర్ల నిడివిగల రహదారుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 17,750 కిలోమీటర్ల మేర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తి కావడానికి 2021-22నుంచి 2024-25వరకూ రాష్ట్రాల వాటాతో సహా మొత్తం 1,12,419కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది.