కరోనాపై భారత్‌-అమెరికా వర్చువల్‌ నెట్‌వ‌ర్క్స్‌

కోవిడ్‌-19 సవాలు పరిష్కారానికి ‘భారత్‌-అమెరికాల వర్చ్యువల్‌ నెట్‌వర్క్స్‌’ద్వారా సంయుక్త కృషి దిశగా ‘భారత-అమెరికా శాస్త్ర-సాంకేతిక వేదిక’ (IUSSTF) ప్రతిపాదనలను ఆహ్వానించింది. తద్వారా కోవిడ్‌ సంబంధిత పరిశోధనల్లోగల రెండు దేశాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ నెట్‌వర్స్క్‌ యంత్రాంగం పరిధిలో కలసి పనిచేసే వీలుంటుంది. ఉభయపక్షాలకు అందుబాటులోగల మౌలిక వసతులను, నిధులను సమర్థంగా వినియోగించే అవకాశమూ లభిస్తుంది. ఈ మేరకు ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంసహా కోవిడ్‌-19 పరిష్కారంలో రెండు దేశాల ప్రయోజనాలు, విలువలను విశ్వసనీయంగా ప్రతిబింబించే ప్రతిపాదనలను IUSSTF ప్రోత్సాహిస్తుంది. ఇందుకోసం ఈ నెల 15వ తేదీనుంచి 2020 మే 15వ తేదీదాకా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

మానవాళికి పెనుసవాలు విసిరిన కోవిడ్‌-19 వంటి సంక్షోభాల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం, భాగస్వామ్యాలు ఎంత అవసరమో నేడు ప్రస్ఫుటమైంది. తద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు సమష్టిగా ఈ మహమ్మారి నిర్మూలనతోపాటు భవిష్యత్‌ సవాళ్లకూ పరిష్కారాలు అన్వేషించడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో భారత-అమెరికాల మధ్య ఒప్పందం కింద 2000 మార్చిలో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తిగల ద్వైపాక్షిక సంస్థ IUSSTF నేడు సంయుక్త సహకారంలో ఉత్ప్రేరక పాత్ర పోషిస్తోంది. లోగడ పలు సందర్భాల్లోనూ వివిధ సాంకేతికతల రూపకల్పనలో IUSSTF బలమైన సంయుక్త సహకార వేదికగా కీలకపాత్ర పోషించిందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ చెప్పారు. అదే తరహాలో నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19పై యుద్ధం కోసం ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోది చేసేందుకు సిద్ధమైందని తెలిపారు.