లాలూ ప్రసాద్ యాదవ్ పై విచారణకు ఆదేశించిన ఝార్ఖండ్ ప్రభుత్వం

లాలూ ప్రసాద్ యాదవ్ పై విచారణకు ఆదేశించిన ఝార్ఖండ్ ప్రభుత్వం

ఓ ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడినట్టుగా బహిర్గతమైన ఆడియో టేపులు బీహార్ లో కలకలం రేపగా, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న లాలూ ఫోన్ ను ఎలా వినియోగించారన్న విషయాన్ని తేల్చేందుకు ఝార్ఖండ్ సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ వెల్లడించారు. రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిస్రా ముండా జైలు సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.ఈ ఆడియో క్లిప్ ను తాను కూడా విన్నానని, ఆ తరువాతే విచారణకు ఆదేశించానని భూషణ్ స్పష్టం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారికి జైలు మాన్యువల్ ప్రకారం మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం లేదని, ఆయన ఫోన్ వాడుంటే, ఎవరి ఫోన్ ను వాడారన్న విషయాన్ని కూడా విచారణలో నిగ్గు తేలుస్తామని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం లాలూ రిమ్స్ డైరెక్టర్ బంగళాలో ఉన్నతాధికారుల అనుమతితో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.లాలూను కలవడానికి వచ్చే వారి విషయంలోనూ రాంచీ జిల్లా పరిపాలనా విభాగం అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన్ను తిరిగి జైలుకు పంపేందుకు అనుమతి కోరుతూ ఝార్ఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణ దశలో ఉంది. వైద్యులు ఓ మారు ఆయన్ను పరిశీలించి, ఆరోగ్యం విషయంలో నివేదిక ఇస్తే, దాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.