ఏపీలో కరోనాపై కీలక నిర్ణయాలు

కోవిడ్‌19 నివారణా చర్యలపై సీఎం YS జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వేలల్లో విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది కష్టం అనిపించినా… విపత్తు దృష్ట్యా, ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడవాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో నిర్ణయం ప్రకారం…

– ఎక్కడివారు అక్కడే ఉండాలి
– పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
– సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు
– కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకే అనుమతి
– ప్రస్తుతం ఇలా వస్తున్న వలసకూలీలు వేలల్లో ఉంటున్నారు
– వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం
– వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది
– అందువల్ల మిగిలిన వారు సహకరించాలి
– కోవిడ్‌–19 విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమకరం
– ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ
– అంతేకాదు మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుంది
– ప్రజారోగ్యం కోసం ఏపీలో పెద్ద ఎత్తున కోవిడ్‌ –19 నివారణా చర్యలు
– ప్రభుత్వం చర్యలకు ప్రజలనుంచి సహకారం కొనసాగాలి
– కోవిడ్‌–19పై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం
– ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో క్వారంటైన్‌ సదుపాయాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు:

– విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులకోసం క్వారంటైన్‌ సదుపాయాల కల్పన ముమ్మరం చేయాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు.
– భోజనం, టాయిలెట్స్, బెడ్స్, బెడ్‌ షీట్లు వీటన్నింటినీ సిద్ధంచేసుకోవాలన్నారు.
– యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలని సీఎం చెప్పారు.
– గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికగానే కాకుండా… జనాభా, అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం నిర్దేశించారు.
– దీనికి సంబంధించి మార్గదర్శకాలను వీలైనంత త్వరగా తయారుచేయాలని, దీనికోసం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు.
– అలాగే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వారి భద్రత దృష్ట్యా కేంద్రం సూచించిన విధంగా ప్రత్యేక రైళ్లద్వారా పంపాలని నిర్ణయించారు.
– దీనికి అవుతున్న ఖర్చులు, భోజనం ఖర్చులతో సహా అన్నీకూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు వెల్లడించారు.
– ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లుతో కూడిన ఒక కిట్‌ కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
– అంతర్‌ జిల్లాల్లో కూలీలను పంపేటప్పుడు బస్సుల ద్వారా పంపాలని సమావేశంలో నిర్ణయించారు.

నమోదైన కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు:

– రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు.
– గడచిన 24 గంటల్లో 58 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
– అలాగే డిశ్చార్జి అయిన వారిసంఖ్య 47 గా వెల్లడించారు.
– 1,14,937 పరీక్షలు చేసినట్టుగా తెలిపారు.
– నిన్న ఒక్కరోజే 6534 టెస్టులు చేసినట్టుగా పేర్కొన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 2152 గా ఉందని తెలిపారు. దేశంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నామని వెల్లడించారు.
– రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.38గా నమోదయ్యిందని, దేశంలో ఇది 3.81 గా ఉందని, అలాగే రాష్ట్రంలో మరణాల శాతం 2.08గా నమోదయ్యిందని, దేశంలో 3.32 శాతంగా నమోదయ్యిందని వెల్లడించారు.
– కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల కేసులు పెద్దగా లేవని అధికారులు తెలిపారు.
– సర్వేలో గుర్తించిన వారికి జోరుగా పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
32,792 మందిలో ఇప్పటివరకూ 23,639 మందికి చేశామని, మిగిలిన వారికి రెండు రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు.

పటిష్టంగా టెలిమెడిసిన్‌:

– టెలిమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, ఈ విధానం బలోపేతం కోసం కొన్ని ఆదేశాలు జారీచేశారు.
– మిస్డ్‌కాల్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడు సార్లు చొప్పున మూడుసార్లు చేయాలని.. అప్పుడే.. ఆ కాలర్‌ అందుబాటులో లేడని గుర్తించాలని సీఎం అన్నారు.
– గ్రామస్థాయిల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఈలోగా టెలిమెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చిన వారికి మందులు డోర్‌ డెలివరీ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు.
– దీనికోసం ద్విచక్రవాహనాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే థర్మల్‌ బాక్స్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
– ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభం అయిన తర్వాత నేరుగా అక్కడే మందులు సహా ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు.
– దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా మరిన్ని చర్యలు- మద్యం ధరలు పెంపు-రానున్న రోజుల్లో మరింతగా తగ్గనున్న మద్యం దుకాణాలు:

–మద్యం దుకాణాలు తెరవవచ్చంటూ కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు. మద్యం నియంత్రణ మన విధానమని ఆదిశగా అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దుకాణాల వద్ద రద్దీ లేకుండా, భౌతిక దూరం పాటించాల్సిన అవసరంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దీనికోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

– మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు.
– మద్యం ధరలను 25శాతం శాతం పెంచాలని నిర్ణయించారు. అంతేకాక రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింతగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
– సీఎం వైయస్‌.జగన్‌ అధికారంలోకి రాగానే 20శాతం దుకాణాలను అంటే 4380 నుంచి 3500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా ఏరివేశారు. మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకు వచ్చారు. ప్రస్తుత నిర్ణయం కారణంగా మద్యందుకాణాల సంఖ్య మరింతగా తగ్గనుంది.
– మద్యం అమ్మకాల వద్ద భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించనున్నారు.
– అలాగే మద్యం అమ్మకాల వేళలను కూడా నియంత్రించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు విధివిధానాలను ఖరారుచేయనున్నారు.