దేశంలో రైతుల కోసం “కిసాన్‌స‌భ‌” యాప్ ప్రారంభం

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో రైతులు తాము ఇప్ప‌టికే కోసిన పంటను మార్కెట్లోకి స‌కాలంలో చేర్చ‌డం, రానున్న సీజ‌న్‌కు విత్తనాలు/ఎరువుల కొనుగోలు విష‌యంలో స‌రైన స‌హాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత మేటి ధరలకు సకాలంలో వాటిని పంపిణీ చేయడానికి వీలుగా బలమైన సరఫరా వ్య‌వ‌స్థ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో రైతుల‌ను స‌ప్ల‌యి చైన్‌తోను మేటి సరుకు రవాణా నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించడానికి న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్‌-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ) కిసాన్‌ స‌భ యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్‌ను ఐసీఏఆర్ డీజీ, డీఏఆర్ఈ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌ త్రిలోచన్ మోహపాత్రా ఈ రోజు ఆవిష్కరించారు. వ్యవసాయ పరిశ్రమలో నిమగ్నమైన రైతులు, రవాణాదారులు మరియు ఇతర సంస్థలకు ఒకే పరిష్కార వేదిక‌గా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయడాన్ని ఆయ‌న అభినందించారు. సీఎస్ఐర్‌తో క‌లిసి ఐసీఏఆర్ ప‌ని చేయ‌గ‌ల‌ద‌ని అన్నారు. అమలు కోసం కృషి విజ్ఞన్ కేంద్రా (కేవీకే) యొక్క నెట్‌వర్క్‌ను వాడుకోవ‌చ్చ‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎస్ఐఆర్ సంస్థ డీజీ, డీఎస్ఐఆర్ కార్య‌ద‌ర్శి డాక్టర్ శేఖ‌ర్ సి మాండే మాట్లాడుతూ “కిసాన్ స‌భ యాప్ అభివృద్ధి మరియు ప్రారంభించడం దేశంలో ఈ క్లిష్టమైన సమయాల్లో రైతులకు మద్దతు ఇవ్వడంలో సీఎస్‌ఐఆర్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఐసీఏఆర్, ఇండస్ట్రీ, ఎంఎస్‌ఎంఈలు, ట్రక్కర్లు మరియు వ్యవసాయ సంఘం మరియు అన్ని వాటాదారులతో భాగస్వామ్యం కావాలని మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. ఈ యాప్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్య‌వ‌సాయ పరిశ్రమ ప్రతినిధులు, రైతులు, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ బృందం మరియు సీఎస్ఐఆర్ యొక్క ఇతర సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

స‌మ‌స్య‌ల అధ్య‌య‌నంతో యాప్ రూప‌క‌ల్ప‌న‌..
సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సతీష్ చంద్ర మాట్లాడు‌తూ మొత్తం వ్యవసాయ మార్కెట్ సరిగ్గా నిర్వహించబడకపోవడం మరియు చాలా ఉత్పత్తులు వృధా కావడం లేదా చాలా తక్కువ రేటుకు అమ్ముడవుతున్న‌ట్టుగా త‌మ‌ వివరణాత్మక ప్రాధమిక అధ్యయనంలో తేలింద‌ని అన్నారు.

వ్య‌వ‌సాయ రంగంలోని వివిధ సమస్యలు మరియు అంతరాలను అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం అంద‌బాటులో ఉన్న వాతావరణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆసియాలోని అతి పెద్ద ఆజాద్‌పూర్ ‌మండిలో డీలర్లు, రవాణాదారులు,రైతులతో ఆరు రోజుల సుదీర్ఘ సర్వే నిర్వ‌హించిన‌ట్టుగా ఆయ‌న తెలిపారు. ఇందులో 500 మందికి పైగా రైతుల‌తో ముఖాముఖిగా మాట్లాడం జ‌రిగి విష‌యాల‌ను తెలుసుకోవడం జ‌రిగింద‌ని అన్నారు. ఈ అధ్య‌య‌నంలోని అంశాల ఆధారంగానే యాప్‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

కిసాన్‌స‌భ యాప్ ద్వారా ల‌భించే వివిధ ప్ర‌యోజ‌నాలు సంక్షిప్తంగా ఈ పోర్ట‌ల్‌ స‌మ‌యానుకూలంగా రైతులు, రవాణాదారులు, సర్వీసు ప్రొవైడర్లు (పురుగు మందులు/ ఎరువులు/డీలర్లు, శీత‌ల గిడ్డంగులు మరియు గిడ్డంగి యజమానులు త‌దితర‌..), మండి డీలర్లు, కస్టమర్లు (పెద్ద రిటైల్ అవులెట్లు, ఆన్‌లైన్ స్టోర్లు, సంస్థాగత కొనుగోలుదారులు త‌దిత‌రులు) మరియు ఇతరుల‌ను సమర్థవంతంగా క‌లిపే దిశ‌గా త‌గిన ప‌రిష్కారాల‌ను సూచించ‌నుంది.

– వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క‌రికీ ఈ పోర్టల్ మేటి గ‌మ్య‌స్థానంగా పనిచేయ‌నుంది. తాము పండించిన‌ పంటలకు మంచి ధర కావాల‌నుకొనే రైతుతో పాటు ఒక‌రి కంటే ఎక్కువ మంది రైతులు అనుసంధానం కావాల‌ని కోరుకునే డీల‌ర్ల‌కు ఇది ఎంతో స‌హ‌య‌కారిగా ప‌ని చేయ‌నుంది. దీనికి తోడు త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో మండీల నుంచి ఖాళీగా వెళ్లాల్సి వ‌స్తున్న ట్రక్కర్ల వారితో కనెక్ట్ కావాలనుకునే వారితో అనుసంధానానికి కూడా ఈ యాప్ తోడ్ప‌డ‌నుంది.

కిసాన్‌స‌భ‌ యాప్ వ్యవసాయ సేవల రంగంలోని ఎరువులు/ పురుగు మందుల డీలర్లు వంటి వారికి కూడా ఉప‌యుక్తంగా ఉంటుంది. ఈ వేదిక ద్వారా వీరు త‌మ సేవలను ఎక్కువ మంది రైతులకు చేర‌వేసేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

శీతల గిడ్డంగులు లేదా గోడౌన్ల‌తో సంబంధం ఉన్నవారికి కూడా ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని రుజువైంది. రైతుల నుండి నేరుగా కొనాలనుకునే వ్యక్తుల కోసం కిసాన్‌స‌భ‌ ఒక వేదికను కూడా అందిస్తుంది. కిసాన్‌స‌భ‌ రైతుల సంర‌క్ష‌ణ‌కు గాను మండి డీలర్లు, రవాణాదారులు, మండి బోర్డు సభ్యులు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు వినియోగదారులు అనే ఆరు ప్రధాన మాడ్యూల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కిసాన్‌స‌భ‌ రైతులకు అత్యంత స‌ర‌స‌మైన‌ మరియు సమయానుసారమైన లాజిస్టిక్స్ సహాయాన్ని అందించేలా తొడ్ప‌డ‌నుంది. దీనికి తోడు మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించడం ద్వారా మరియు సంస్థాగత కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా రైతుల‌ లాభాలను పెంచేందుకు కూడా కృషి చేయ‌నుంది. సమీప మాండీలను పోల్చడం ద్వారా పంటల యొక్క ఉత్తమ మార్కెట్ రేట్లను అందించడంలో ఇది సహాయపడుతుంది. తక్కువ ఖర్చుతో సరుకు రవాణా వాహనాన్ని బుక్ చేయడం ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనం లభించేందుకు ఇది తోడ్ప‌డ‌నుంది.