కాళేశ్వరంలో అనంతగిరి సిరులు

కాళేశ్వరంలో అనంతగిరి సిరులు

కాళేశ్వరం గంగ మరో మెట్టు పైకెక్కింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌ నుంచి తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి నాలుగో లింక్‌కు కనెక్ట్‌ అయింది. నదీగర్భం నుంచి ఇప్పటికే మూడొందల మీటర్లకుపైగా ఎత్తులో ఉన్న ఎస్సారార్‌లోకి వచ్చిన గోదావరి జలాలు.. తాజాగా అన్నపూర్ణ జలాశయంలోకి దుంకాయి. మరో పక్షంరోజుల్లో మిగిలిన ఐదుదశల్లోనూ జలాలను ఎత్తిపోసి.. బేసిన్‌లోనే గరిష్ఠ ఎత్తులోఉన్న కొండపోచమ్మ సిగలోకి గంగమ్మను పంపేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ నెల 25వ తేదీకల్లా లక్ష్మీ బరాజ్‌ నుంచి దాదా పు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ జలాశయంలోకి కాళేశ్వరం జలాలుచేరే అవకాశం ఉన్నది. పలు జలాశయాలను దాటుకుంటూ.. బీడు భూములను స్థిరీకరించుకుంటూ ముందుకుసాగిన కాళేశ్వరం నీళ్లు.. ప్రాజెక్టులోనే గరిష్ఠంగా నాలుగో దశలో డిజైన్‌చేసిన 5,89,280 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయనున్నది.

శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరి జలాలను అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోసే ప్రక్రియ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్‌ పంప్‌హౌజ్‌లో అధికారులు బుధవారం ఒక మోటరు ట్రయల్న్‌న్రు విజయవంతంగా నిర్వహించారు. దీంతో 2,836 క్యూసెక్కుల నీరు అన్నపూర్ణ జలాశయంలోకి దుంకాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌ వరకు నీటిని ఎత్తిపోయడంలో అన్నపూర్ణ రిజర్వాయరే అత్యంత కీలకం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం 3.5 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10లో భాగంగా ఏర్పాటుచేసిన అన్నపూర్ణ రిజర్వాయర్‌ ఎస్సారార్‌కు 11.186 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎస్సారార్‌ జలాశయం వద్ద ఏర్పాటుచేసిన క్రస్ట్‌గేట్ల నుంచి జలాలు 3.535 కిలోమీటర్ల పొడవు గ్రావిటీ కెనాల్‌, 2.38 కిలోమీటర్ల భూమ్యాకర్షణ కాలువ, తర్వాత 7.651 కిలోమీటర్లు సొరంగమార్గం ద్వారా తిప్పాపూర్‌లో 56 మీటర్ల వెడల్పు, 92 మీటర్ల లోతుతో ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌( మహాబావి)కు చేరుతాయి. సర్జ్‌పూల్‌కు వచ్చిన నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు నాలుగు మోటర్లను ఏర్పాటుచేశారు. ఒక్కోమోటర్‌ సామర్థ్యం 106 మెగావాట్లు. నాలుగు మోటర్లు కలిసి రోజుకు ఒక టీఎంసీ నీటిని 101.2 మీటర్ల ఎత్తుకు ఎత్తి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తాయి.

బుధవారం నిర్వహించిన ఒకటో మోటర్‌ ట్రయల్న్‌ విజయవంతం కావడంతో.. గురువారం సాయంత్రం వరకు రెండో మోటరు ట్రయల్న్‌క్రు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో మిగిలిన రెండింటి ట్రయల్న్‌ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 90 రోజుల్లో 88.24 టీఎంసీల నీటిని ఎత్తిపోసేవిధంగా రూపకల్పన చేశారు. పవర్‌ కోసం అన్నపూర్ణ రిజర్వాయర్‌ పరిధిలోనే 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌ ఏర్పాటుచేశారు. ఈ రిజర్వాయర్‌ కింద సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 35 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనున్నది. 3.5 టీఎంసీల సామర్థ్యం గల అన్నపూర్ణలో 0.8 టీఎంసీల మేర నిల్వ చేరుకున్న తర్వాత రంగనాయకసాగర్‌ జలాశయంలోకి నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుందని కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం తెలిపారు. ఆ స్థాయి నిల్వకు చేరుకున్నాక సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం చంద్లాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోత ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఒక్కో మోటరు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నామని, నాలుగైదు రోజుల్లో పరిస్థితులు అనుకూలిస్తే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మోటర్లు నడిపే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

నాలుగో లింకులో ప్రయాణమిది..
ఎస్సారార్‌ నుంచి 1.15 కిలోమీటర్ల అప్రోచ్‌ చానెల్‌.. తర్వాత 2.38 కిలోమీటర్ల భూమ్యాకర్షణ కాలువ అనంతరం 7.65 కిలోమీటర్ల మేర సొరంగమార్గం ద్వారా జలాలు ఆసియాలోనే అతి పెద్దబావి (సర్జ్‌పూల్‌)లోకి చేరుకుంటాయి. అక్కడ నిర్మించిన పంపుహౌజ్‌లోని మోటర్ల ద్వారా అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోస్తారు. (మోటర్ల సంఖ్య: నాలుగు.. ఒక్కోమోటర్‌ సామర్థ్యం: 106 మెగావాట్లు)
అన్నపూర్ణ జలాశయం నుంచి 1.74 కిలోమీటర్ల అప్రోచ్‌ చానెల్‌, 0.45 కిలోమీటర్ల భూమ్యాకర్షణ కాల్వ ఆపై 8.59 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ప్రవహించిన జలాలు చంద్లాపూర్‌ పంపుహౌజ్‌ (మోటర్ల సంఖ్య: నాలుగు.. సామర్థ్యం: 134 మెగావాట్లు)కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోస్తారు.
రంగనాయకసాగర్‌ నుంచి 4.20 కిలోమీటర్ల అప్రోచ్‌ చానెల్‌, 6.18 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా తుక్కాపూర్‌ పంపుహౌజ్‌ (మోటర్ల సంఖ్య: ఎనిమిది.. సామర్థ్యం: 43 మెగావాట్లు)కు చేరుకుంటాయి. ఇక్కడినుంచి మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. అయితే మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మాణం పూర్తికానందున 18.5 కిలోమీటర్ల ఫీడర్‌ చానెల్‌ ద్వారా నీటిని ముందుకుతీసుకెళతారు.
మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కారం పంపుహౌజ్‌ (మోటర్ల సంఖ్య – ఆరు, సామర్థ్యం 27 మెగావాట్లు)లోని మోటర్ల ద్వారా జలాల్ని ఎత్తిపోస్తారు.
జలాలు మరో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కూర్‌ పంపుహౌజ్‌ (మోటర్ల సంఖ్య: ఆరు.. సామర్థ్యం 34 మెగావాట్లు)కు చేరుకుంటాయి. అక్కడ నీటిని మరోసారి ఎత్తిపోయడం వల్ల దాదాపు కిలోమీటర్‌ ఉన్న కాల్వ ద్వారా కొండపోచమ్మ జలాశయంలోకి చేరుకుంటాయి.

గరిష్ఠ ఆయకట్టు ఈ లింకులోనే..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. ప్రాజెక్టులోని ఏడు లింకుల పరిధిలో 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు రూపకల్పన చేశారు. ఇప్పటివరకు కాళేశ్వరం జలాలు రెండులింకులను దాటాయి. తాజాగా నాలుగో లింకులోకి ప్రవేశించాయి. మొదటిలింకు (లక్ష్మీబరాజ్‌ నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు)లో గోదావరి నుంచి జలాలను నదీమార్గంలో వెనక్కి ఎత్తిపోయడంతోపాటు, బరాజ్‌లలో నిల్వచేయ డం ప్రధాన లక్ష్యం. ఈ లింకులో ఆయకట్టు కేవలం 30వేల ఎకరాలు. రెండోలింకులో ఎల్లంపల్లి నుంచి ఎస్సారార్‌లోకి గోదావరిజలాల్ని తరలిస్తున్నారు. మూడోలింకులో ఎస్సారార్‌ నుంచి ఎగువమానేరుకు తరలించడం. దీని పరిధిలో 86,150 ఎకరాలు ఉన్నది. నాలుగో లింకులోనే గరిష్ఠంగా 5,89,280 ఎకరాల ఆయకట్టు (మొత్తంలో 32.27 శాతం) ఉన్నది. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్‌ జలాశయం కూడా ఈ లింకులోనే ఉన్నది.

పదిహేను రోజుల్లో కొండపోచమ్మకు..
అన్నపూర్ణ జలాశయం నుంచి వారంరోజుల్లో రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు రానున్నాయి. రంగనాయకసాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం మూడుటీఎంసీలు. ఆ తర్వాత మల్లన్నసాగర్‌ పూర్తికాకపోవడంతో కొండపోచమ్మ వరకు మధ్యలో జలాశయాల్లో నిల్వచేయడానికి వీలులేదు. దీంతో ఈ నెల 25 వరకు గోదావరిజలాల్ని కొండపోచమ్మ సాగర్‌లోకి ఎత్తిపోసేలా అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి కొండపోచమ్మ వరకు ఐదుదశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా.. ఇవన్నీ తొలిసారిగా ఆన్‌ అవుతున్నవి. సాంకేతికంగా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండటంతో ఈ నెలాఖరులోగా 15 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న, గరిష్ఠంగా 614 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు కాళేశ్వరజలాలు చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.