అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ

అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సీరీస్ లో భాగంగా రేపు ఉదయం తొలి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభం కానుంది. ఇదే వేదికపై రెండు వన్డేలు జరుగనుండగా, వన్డే సిరీస్ లో చివరిదైన మూడవ మ్యాచ్ కాన్ బెర్రాలో జరుగుతుంది. ఈ సీరీస్ ద్వారా కోహ్లీ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఊరిస్తున్న ఈ రికార్డును కోహ్లీ కచ్చితంగా సాధిస్తాడని అతని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.అదేంటంటే, వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 133 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్ లలో కోహ్లీ 133 పరుగులను మించి సాధిస్తే, ఆ ఘనత సాధించిన ఆరవ ప్రపంచ క్రికెటర్ గా నిలుస్తాడు. అంతకన్నా ముఖ్యమైనది మరొకటుంది. అదేంటంటే, మిగతా ఐదుగురూ ఈ ఫీట్ ను సాధించడానికి 300 కన్నా ఎక్కువ ఇన్నింగ్స్ లను ఆడాల్సి వచ్చింది. కోహ్లీ మాత్రం ఇప్పటివరకూ 248 మ్యాచ్ ల్లో 239 ఇన్నింగ్స్ లు ఆడి 11,867 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లో 133 పరుగులు సాధిస్తే, 12 వేల పరుగులను అతి తక్కువ ఇన్నింగ్స్ లో సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.కాగా, ఇప్పటివరకూ వన్డేల్లో విరాట్ కోహ్లీ 32 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. తానాడిన మ్యాచ్ లలో 93.25 స్ట్రయిక్ రేట్ తో సరాసరిన 59.34 పరుగులను సాధిస్తూ వచ్చిన కోహ్లీ, ఆస్ట్రేలియాతో జరగనున్న సీరీస్ తోనే ఈ రికార్డును సాధించే అవకాశాలు ఉన్నాయి. కాగా, వన్డే, టీ-20 సీరీస్ లను, ఆపై తొలి టెస్టును ఆడనున్న కోహ్లీ, ఆ వెంటనే ఇండియాకు పయనం కానున్నాడు. కోహ్లీ భార్య అనుష్క డెలివరీ సమయానికి ఇండియాలో ఉండాలని కోహ్లీ భావిస్తున్నాడు.