మనిషిపై కరోనా ప్రభావం ఎలా?

మనిషిపై కరోనా ప్రభావం ఎలా?

మనిషిపై కరోనా ప్రభావమిలా, లాన్సెట్‌ జర్నల్‌లో నివేదిక.
చైనాలోని వూహాన్‌ పల్మనరీ ఆస్పత్రిలో కరోనా బాధితులు 191 మందిని ఎంపిక చేసుకొని మూడు వారాల పాటు వారిని నిశితంగా పరిశీలించి రూపొందించిన నివేదికని తాజా సంచికలో ప్రచురించింది. లాన్సెట్‌ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయిదు రోజుల తరవాత జ్వరం, గొంతు నొప్పి, జలుబుతో మొదలవుతుంది. ఒక్కోసారి లక్షణాలు బయటపడడానికి 14 రోజులు కూడా పడుతుంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ మన శరీరంపై ప్రభావం చూపించడం ప్రారంభించాక ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు వస్తాయంటే.

గొంతు నుంచి ఊపిరితిత్తులు, అక్కడ్నుంచి రక్తంలోకి

1-3 రోజులు
కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించగానే మొదట జ్వరం వస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయి. కరోనా బాధితుల్లో లక్షణా లు ఇలా మొదలైన వారు 80%.

4-9 రోజులు
*మూడు నుంచి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది. కొంతమందిలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు 14%.

8-15 రోజులు
ఊపిరితిత్తులకు చేరిన ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ప్రాణాంతకమైన సెప్సిస్‌ (బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌) ఒక వారం తర్వాత మొదలవుతుంది. అప్పట్నుంచి రెండు వారాల పాటు బాధితుల్ని కాపాడుకోవడానికి అత్యంత జాగరూకత అవసరం. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వారికి చికిత్స అందించాలి. బాధితుల్లో ఈ పరిస్థితి వచ్చిన వారు 5%.

3 వారాల తర్వాత
రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాలు చికిత్స ఇస్తే కరోనాను జయించడం సులభమే. హైపర్‌ టెన్షన్‌ వంటి వ్యాధులు ఉండి వయసు మీద పడిన వారికి ఈ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టం.