మినీ పురపోరుకు కేటీఆర్ దూరం

మినీ పురపోరుకు కేటీఆర్ దూరం

  1. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మరో ఐదు మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం, మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, ఐటీ, మునిసిపల్ మంత్రి కె. తారక రామారావు, ప్రచార కార్యక్రమాలకు దూరమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 27 వరకే సమయం ఉండటం, రాత్రి 8 గంటల్లోపే ప్రచారాన్ని ముగించాల్సి వుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. ఇక ప్రచారానికి వచ్చే అభ్యర్థులను కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఓటర్లు కూడా పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. ఇక నిబంధనల కారణంగా ప్రచారానికి జన సమీకరణకు కూడా వీల్లేకపోయింది. ఇది పోటీలో ఉన్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో ముందుగా షెడ్యూల్ చేసిన మంత్రి కేటీఆర్ పర్యటనలన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కేటీఆర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్న నేపథ్యంలో, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో జరగాల్సిన రోడ్ షోలన్నీ రద్దు చేయాల్సి వచ్చింది.దీంతో సంబంధిత కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలే బాధ్యతలను తీసుకుని, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీలోని క్షేత్రస్థాయి కార్యకర్తలను సమన్వయం చేసుకుని, ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో వరంగల్ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, ఖమ్మం పరిధిలో మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రచారం జరుగుతోంది. వీరికి తోడుగా మంత్రి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు ప్రచారంలోకి దిగారు.వీరంతా స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి ఓటర్లను కలిసి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక సిద్ధిపేట మునిసిపల్ పరిధిలో మంత్రి హరీశ్ రావు ఒక్కరే ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ లను కలుపుకుని ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్లా గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నారు.