పవన్, శృతిహాసన్ జంటగా వకీల్ సాబ్, ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధం

పవన్, శృతిహాసన్ జంటగా వకీల్ సాబ్, ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధం

పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఓ కార్యక్రమంలో ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ప్రకారం తాము మొదట మరో టైటిల్ అనుకున్నామని వెల్లడించారు. ‘మగువా’ అనే టైటిల్ అయితే సరిపోతుందని భావించామని తెలిపారు.అయితే, పవన్ కల్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఖరారు చేశామని వివరించారు. పవన్ కల్యాణ్ అంటే వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు థియేటర్లకు తరలి వస్తారని, అందుకే పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలో కొన్ని అంశాలను చేర్చామని తెలిపారు.అయితే కథ ఆత్మ దెబ్బతినకుండా పాటలకు స్థానం కల్పించామని, తమన్ చక్కని బాణీలు అందించారని కితాబిచ్చారు. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ ‘వకీల్ సాబ్’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయిక కాగా, కథకు అవసరమైన ముఖ్యపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు.